కారు బేజారు.. మూసుకపోతున్న బీఆర్ఎస్ గెలుపు దారులు
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు దారులు మూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఏ మండలంలో చూసిన బీఆర్ఎస్, బీజేపీ నుంచి అనునిత్యం కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి.
దిశ, తిరుమలగిరి (సాగర్) : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు దారులు మూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఏ మండలంలో చూసిన బీఆర్ఎస్, బీజేపీ నుంచి అనునిత్యం కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాస్ట్లీ రాజకీయం నడుస్తుంది. ఊహించని విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిపోతుంది. కారు గేర్ రివర్స్ గేరులో వెళ్ళుతున్నట్టు చర్చ సాగుతుంది. ఇరు పార్టీల అభ్యర్థుల నామినేషన్ అనంతరం ప్రచారం మరింత వేడెక్కనుంది. పార్టీలోకి వస్తే నాకేంత.. నా వెంట వారికి ఎంత అనే ధోరణి కార్యకర్తలు అవలంబిస్తున్నారు.
ఈ రోజు ఒక పార్టీలో కండువా కప్పుకున్న కార్యకర్తలు.. రేపు మరో పార్టీకి చేరువవుతున్నారు. రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తుంటే.. అంతర్మథనంలో బీఆర్ఎస్ పార్టీ కేడర్ కొట్టుమిట్టులాడుతుంది. పైకి గంభీర స్వరం వినిపిస్తున్నప్పటికీ లోపల దిక్కుతోచని స్థితిలో కారు బేజారు అవుతున్నట్టు సంకేతాలు, రిపోర్ట్స్ పార్టీ అధిష్టానానికి చేరుతున్నాయి. ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు అనంతరం నుంచి ఎమ్మెల్యే తీరు.. కార్యకర్తలు గ్రామాలలో చేసే తప్పిదాలే ఆ పార్టీ ఓటమికి దారితీస్తున్నట్టు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. గ్రామాలలో ఉన్న చోటామోటా లీడర్ల షోయింగ్ చేష్టలు, చిల్లర పనులతో విసుగెత్తిన మరొక వర్గం పూర్తిగా పార్టీకి నష్టం చేకూర్చేలా కనిపిస్తుంది. గురువారం ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేస్తుండడంతో.. ఎవరి బలం ఎంత ఉంది అనే కోణంలో జన సమీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మొదలైన బుజ్జగింపుల పర్వం..
నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వర్గాలుగా చీలిపోయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను స్థానికంగా బుజ్జగించే వారే కరువయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు గుర్రంపోడు మండలం నుంచి కొంతమంది అసమ్మతి నాయకులను తీసుకెళ్లిన వారు పార్టీ గెలుపునకు కృషి చేసేదే లేదని ఖరాకండిగా చెప్పడంతో షాకు కు గురయ్యారు. దీంతో మూడు మండలాలకు చెందిన ముఖ్యమైన ప్రజాప్రతినిధులను హైదరాబాద్ కు తీసుకెళ్లి కేటీఆర్ సమక్షంలో బుజ్జగించినట్టు సమాచారం. పార్టీ వైఖరి పై అసమ్మతిగా ఉన్న యాదవ సామాజిక వర్గం నాయకుల పై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అసమ్మతి వర్గంలో ఉన్న కార్యకర్తలు పూర్తిగా వేరే పార్టీలలో చేరితే.. నిజమైన కార్యకర్తలుగా మేమే చలామణి అయి గెలిపిస్తామనే ధోరణిలో ఎమ్మెల్యే అనుచరులు ఓటర్లకు చెప్పుకొస్తున్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో అసమ్మతి వర్గానికి సరైన క్రమంలో న్యాయం జరగలేదని ఆరోపణలు వినిపించాయి. కానీ వాటిని పూడ్చుకునే ధోరణి అవలంబించకపోవడంతో ఇప్పటికే పార్టీకి జరగరాని నష్టం జరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిజమైన కార్యకర్తలు పార్టీలో ఇమడలేక..
వర్గ విభేదాలతో విసుకు చెందిన పార్టీలో ఉన్న వివిధ మండలలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి తెలంగాణ భావజాలాన్ని గ్రామగ్రామాన నూరిపోసిన ఉద్యమకారులు, నిజమైన కార్యకర్తలు పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వారికి సరైన గౌరవం ఇవ్వడం లేదని కొందరు ఇప్పటికే బహటంగానే తమ ఆవేదనను వ్యక్తపరిచారు. 2018 అసెంబ్లీ, 2021 ఉపఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన అనంతరం పార్టీలోకి వచ్చిన వలసదారులకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడంతో మనసు నోచ్చుకున్న నిజమైన కార్యకర్తలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కూడా సరైన గౌరవం ఇవ్వకపోవడంతో వారు వ్యతిరేకతతో ఉన్నారు.
అసమ్మతి వర్గం సైలెంట్ రాజకీయం...
నియోజకవర్గంలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ వర్గాలుగా చీలిపోయినప్పటికీ బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి షాక్ తగలేలా కనిపిస్తుంది. ఎమ్మెల్యే వర్గం పార్టీ సమావేశాలు, సంక్షేమ పథకాల పంపిణీ, నామినేటెడ్ పదవుల విషయంలో సమానత పాటించకపోవడంతో విసుగు చెందిన కొందరు కార్యకర్తలు ఇప్పటికే పార్టీని వీడారు. ఈనెల 15 తర్వాత మరింత మంది పార్టీని వీడే అవకాశం ఉండడంతో అసమ్మతి కార్యకర్తలకు హామీలు ఇస్తున్నట్టు చర్చసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే వర్గం నుంచి సరైన సమాచారం అందకపోవడంతో ఇప్పటికే పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ఎమ్మెల్సీ వర్గం సైలెంట్ గా తమ పని తాము కానిస్తున్నట్టు చర్చ సాగుతుంది. వారు పార్టీ కార్యక్రమాలలో ప్రచారాలలో కూడా పాల్గొనక పోవడంతో దీనికి బలం చేకూరుతుంది. ఎమ్మెల్సీకి పార్టీ తరఫున ప్రచారం రథం అప్పచెప్పిన్నప్పటికీ ఆయన అనుచరులు మాత్రం పార్టీ కోసం పనిచేయడానికి ససేమిరా అంటున్నట్టు సమాచారం.
ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ దూకుడు..
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సూచించిన 6 గ్యారంటీలతో కాంగ్రెస్ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తుంది. ఒకవైపు చేరికల పై ఫోకస్ చేస్తూనే మరోవైపు ప్రచారాన్ని గ్రామ గ్రామానికి విస్తరిస్తున్నారు. ఈ నెల 15 తర్వాత మరింత దూకుడు ప్రదర్శిస్తామని కాంగ్రెస్ శ్రేణులు బహటంగానే తెలుపుతున్నారు. మహిళలు, యువత టార్గెట్ గా ప్రచారం నిర్వహిస్తూ అనునిత్యం ప్రజలలో ఉంటున్నారు.