రామాపురంలో విగ్రహాల రాజకీయం..!

మండలంలోని రామాపురం (కట్టకొమ్ముగూడెం)లో రాను రానూ విగ్రహాల రాజకీయం రాజుకుంటోంది.

Update: 2024-11-27 09:48 GMT

దిశ, చిలుకూరు : మండలంలోని రామాపురం (కట్టకొమ్ముగూడెం)లో రాను రానూ విగ్రహాల రాజకీయం రాజుకుంటోంది. గతంలో గ్రామంలో నెలకొల్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహం తలను ఎవరో తొలగించారు. కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆయా రాజకీయ పార్టీల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దానికి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విగ్రహం సరిగ్గా వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా ఉంచారని, దాంతో వైఎస్సార్ విగ్రహం కనిపించడం లేదని వారు ఆరోపించారు.

రాత్రికి రాత్రే విగ్రహాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కొందరు స్థానికులు మాట్లాడుతూ తాము ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి పూజలకు చిలుకూరు కానీ కోదాడ కానీ వెళ్లాల్సి వస్తోందని, గ్రామంలో ఆంజనేయ విగ్రహం నెలకొల్పితే అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్యులేనని, వారి విగ్రహాలను ధ్వంసం చేయడం కూడా క్షమార్హం కాదంటున్నారు. ఫిర్యాదు మేరకు కోదాడ రూరల్ సీఐ రజితా రెడ్డి సూచనల మేరకు చిలుకూరు ఏఎస్సై వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో రామాపురం వెళ్లారు. ఈ విషయమై 'దిశ' ఆయనను సంప్రదించగా స్థానికులతో చర్చించి ఈ విషయాన్ని పరిష్కరిస్తామని సీఐ సూచించినట్లు ఆయన తెలిపారు.


Similar News