మునుగోడు కాంగ్రెస్‌లో అయోమయం

మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక వచ్చింది

Update: 2023-03-22 02:02 GMT

మునుగోడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉప ఎన్నికల ఫలితాలతో కొంత నైరాశ్యం నెలకొంది.దీన్ని తొలగించి పార్టీలో నూతన ఉత్తేజం నింపాల్సిన నాయకులు టికెట్ల కోసం పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండడంతో ఎవరి వెంట నడవాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానంటూ ఇప్పటికే చలమల్ల కృష్ణారెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలతో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటూ భరోసానిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి తో ఉన్న సాన్నిహిత్యంతో పార్టీలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా చలమల కృష్ణారెడ్డి పొందరాని కావున రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకే వస్తుందంటూ ఆయన అనుచరులు చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా పాల్వాయి స్రవంతి కూడా ఉప ఎన్నికల ఫలితం తర్వాత నిరాశ చెందకుండా తిరిగి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హథ్ సే హథ్ జోడో పాదయాత్రను ఇద్దరూ వేరువేరుగా చేపట్టారు.

దిశ,సంస్థాన్ నారాయణపురం: మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక వచ్చింది. అయితే అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేనంటే నేను పోటీ చేస్తానంటూ పాల్వాయి స్రవంతి,చలమల్ల కృష్ణారెడ్డి పోటీపడ్డారు. కానీ చివరకు పార్టీ అధిష్టానం మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించడంతో చలమల కృష్ణారెడ్డి కూడా స్రవంతి గెలుపు కోసం పనిచేశారు. ఉప ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో సహా బీజేపీ పార్టీలో భారీగా చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది.

అయితే ఇదంతా బాగానే ఉన్నా ఎన్నికల అనంతరం అయినా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నాయకులు శ్రమిస్తారనే గంపెడాశలతో పార్టీ శ్రేణులు ఎదురుచూస్తుండగా కొత్తగా మరో తలనొప్పి తయారైంది. గత ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి తిరిగి రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానంటూ నియోజకవర్గంలో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా పోటీ చేస్తానంటూ చలమల్ల కృష్ణారెడ్డి తన అనుచరులతో బాహాటంగానే వెల్లడిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నాయంటూ సన్నిహితులతో వెల్లడిస్తున్నట్లు సమాచారం. కావున రాబోయే ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన పోటీ ఖాయమేనని ధీమాలో ఉన్నారు.

అందులో భాగంగానే ప్రతినిత్యం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో నివాసం ఉండేలా ఇప్పటికే ఆయన క్యాంపు ఆఫీస్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. ఇదంతా ఇలా ఉండగా మునుగోడు ఇంచార్జ్ పాల్వాయి స్రవంతి అంటూ ఆమె అనుచరులు కాదు చలమల్ల కృష్ణారెడ్డి అంటూ ఆయన అనుచరులు వెల్లడిస్తున్నారు. దీంతో ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరికతో కాంగ్రెస్ పార్టీ కొంత బలహీన పడింది.

గతంలో కోమటిరెడ్డి,పాల్వాయి వర్గాలుగా ఉన్న మునుగోడు కాంగ్రెస్ లో తిరిగి రెండు వర్గాలు ఏర్పడడంతో తాము ఎవరి వెంట తిరగాలో తెలియక పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎవరినో ఒకరిని ప్రకటించి పార్టీ శ్రేణుల గందరగోళానికి తెరదించాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News