యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా పెండింగ్ లో ఉన్న భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Update: 2024-11-08 10:24 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా పెండింగ్ లో ఉన్న భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా.. కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్ ద్వారా బీబీనగర్ మండలం మక్తఅనంతారం మీదుగా మూసీ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ.. పోచంపల్లి, వలిగొండ మండలాలను యాదగిరిగుట్ట ప్రాంతానికి చేరుకొని, యాదగిరిగుట్ట కొండ చుట్టూ తిరిగి హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ కు ప్రయాణమయ్యారు. ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి యాదాద్రి కొండపైకి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక కాన్వాయ్ లో కొండపైకి చేరుకున్నారు. కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసి.. అఖండ దీపారాధన వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి టెంకాయ సమర్పించారు. అక్కడి నుంచి తూర్పు రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అంతరాలయంలో స్వయంభువులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా..ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. అక్కడి నుంచి తిరిగి రోడ్డు మార్గం ద్వారా ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు‌.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై వైటిడిఏ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్న అధికారులను ఆదేశించారు.టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండదని గుర్తుచేసిన సీఎం, ఇప్పడు కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలన్నారు. ‌అందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని అధికారులను అదేశించారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని తేల్చి చెప్పారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్ష అనంతరం ఆయన భోజనం చేసి మంత్రులతో కలిసి మూసి పునరుజీవన యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట కొండపై భద్రత వైఫల్యం...

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా యాదగిరిగుట్ట కొండపై భద్రత వైఫల్యం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి కొండపైకి చేరుకొని అఖండ దీపారాధన అనంతరం తూర్పు రాజగోపురం ద్వారా లోపలికి వెళ్లే క్రమంలో పార్టీ కార్యకర్తలు ఒకేసారి దూసుకొచ్చారు. దీంతో వారిని అదుపు చేయలేక పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలను తూర్పు రాజగోపురం ద్వారా లోపలికి పంపించే క్రమంలో కార్యకర్తలు సైతం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఓ దశలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. పోలీసులు బలవంతంగా నెట్టేసి తూర్పు రాజగోపురం వద్ద ద్వారబంధనం చేశారు. ఓ దశలో కార్యకర్తల అత్యుత్సాహం వలన మంత్రి కొండా సురేఖ సైతం ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన ఆమె వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆలయంలో లోపటికి తీసుకువెళ్లారు. సీఎం అఖండ దీపారాధన చేస్తున్న సమయంలో దూరంగా ఉన్న కార్యకర్తలు సరిగ్గా సీఎం బయటకు వచ్చే క్రమంలో దూసుకొచ్చారు. వీరిని కట్టడి చేయడం పోలీసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

కుక్క హాల్ చల్....

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ రెసిడెన్షియల్ సూట్ నుంచి మరికాసేపట్లో యాదగిరిగుట్ట కొండపైకి వచ్చే సమయంలో ప్రధాన ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న క్యూ కాంప్లెక్స్ పైన ఒక చిన్న కుక్క హల్ చల్ చేసింది. దీంతో ఆ కుక్కను అక్కడ నుంచి తప్పించడానికి సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. గత నెల అక్టోబర్ 22న ఇలాగే ఒక శునకం నేరుగా ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. దీంతో ఆలయ అధికారులు ప్రధానాలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. మరోసారి సీఎం గుట్ట పర్యటన నేపథ్యంలో...కొండపైన ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల దేవస్థాన అధికారులపై భక్తులు మండిపడుతున్నారు.


Similar News