మూసి ప్రక్షాళన పై సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో పాలన పై పూర్తిస్థాయిలో దృష్టి సారించామని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే లక్ష్యంతో తమ పాలన కొనసాగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2024-07-04 11:35 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాష్ట్రంలో పాలన పై పూర్తిస్థాయిలో దృష్టి సారించామని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే లక్ష్యంతో తమ పాలన కొనసాగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన హాజరయ్యారు.‌ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడు నెలల పాలనలో ఇది మా పాలనకు రెఫరెండం చెప్పిన ధైర్యశాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలిచామని, ఒక్క సీటు కొద్దిగా తేడాతో ఓడిపోయామన్నారు. హైదరాబాదుకు తాగునీరు అందించేందుకు మల్లన్న సాగర్ నుంచి నీటిని తీసుకొచ్చేందుకు పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. మూసీ ప్రక్షాళన పై ముఖ్యమంత్రి దృష్టి సాధించారని, త్వరలో అది పూర్తి అవుతుందని చెప్పారు.

ఆగస్టు 15 లోపు రుణమాఫీ అయిపోతుందని భరోసా ఇచ్చారు.‌ రూ. 4500 కోట్లతో హైదరాబాద్, విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం సెప్టెంబర్ లో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. ఉప్పల్, ఘట్కేసర్ ఫ్లైఓవర్ పాతది టెండర్ రద్దుచేసి కేంద్ర మంత్రి గడ్కారితో మాట్లాడి కొత్త టెండర్ నెలరోజులు లోపు పిలుస్తామని వెల్లడించారు.

అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.‌ బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఏడు స్థానాలలో డిపాజిట్ రాలేదని, మళ్లీ ఎలా అధికారంలోకి వస్తారని, పదిహేనేళ్లు ఎలా ఉంటారని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట ఆలయానికి సమర్ధుడైన అధికారిని పెట్టి ఆరు నెలల్లో భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచామని, త్వరలో యాదగిరిగుట్టలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామన్నారు. యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధిలో రహదారులను మర్చిపోయారాని, ఇప్పుడు రహదారుల అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తున్నామన్నారు.‌ యాదాద్రిని యాదగిరిగుట్టగా పేరు మార్చాలని సీఎం తెలిపినట్లు చెప్పారు.‌ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. ఎంపీగా గెలిపించినప్పుడే పనులు చేశానని, ఇప్పుడు మంత్రిని అయ్యానని రెట్టింపు పనులు చేస్తామన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందని, ఎంపీని కూడా గెలిపించుకున్నామన్నారు. ఈ ప్రాంతానికి మిషన్ భగీరథ నీటి అందించడానికి రూ. 210 కోట్లు మంజూరు చేశామన్నారు. దీంతో పాటు గంధమల్ల ప్రాజెక్ట్ రీ ఎస్టిమేట్ వేసి, త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు.

కలెక్టర్, డీసీపీలతో సమావేశం..

భువనగిరిలో మంత్రి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతు జిండాగే, డీసీపీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ గంగాధర్ లతో సమావేశమయ్యారు. జిల్లాలో పాలనకు సంబంధించిన పలు విషయాలను వారితో చర్చించారు.

దొడ్డి కొమరయ్యకు నివాళి..

దొడ్డి కొమురయ్య వర్ధంతి, స్వామి వివేకానంద వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట ఎంపీడీవో కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయనతో పాటు ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Similar News