'ముంబై వలస కూలీలను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం'
తెలంగాణ వస్తే వలసలు ఉండవని చెప్పిన కేసీఆర్ ని నమ్మి, తెలంగాణ సాధనలో కీలక భూమిక....BSP Leaders serious On CM KCR
దిశ, చౌటుప్పల్: తెలంగాణ వస్తే వలసలు ఉండవని చెప్పిన కేసీఆర్ ని నమ్మి, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన ముంబై వలస కూలీలు ఆవేదనకు గురవుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. మునుగోడు నియోజకవర్గ నాయకులు, జిల్లా ఇన్చార్జి కొండమడుగు రాజు, నియోజకవర్గ ఇన్చార్జి అందోజు శంకరాచారి, ఏర్పుల అర్జున్ లతో కూడిన సభ్యుల బృందం ముంబైలో మూడు రోజుల పాటు పర్యటించినట్లు శుక్రవారం చౌటుప్పల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నుండి ముంబైకి దాదాపు 5 లక్షల మంది వలస వెళ్లినట్టుగా అక్కడి కూలీలు తెలిపారన్నారు. మునుగోడు నియోజకవర్గం నుండి దాదాపు 20,000 మంది అక్కడ వలస కూలీలుగా జీవిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఈ వలస కూలీలు 180 సంఘాలుగా ఏర్పడి 280 కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఉద్యమం నుండి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా తమ గోడు వినలేదని వారు వాపోయారని తెలిపారు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్లేసే యంత్రాలుగా వారిని వాడుకుంటున్నారని, అన్ని పార్టీల నాయకుల ప్రవర్తనను వారి తీరును దుయ్యబట్టినట్టు వెల్లడించారు.
వలస కార్మికుల పిల్లలకు స్థానికత మీద వచ్చే విధంగా లోకల్, నాన్ లోకల్ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు వలస కార్మికులకు ఇవ్వాలని కోరారు. మునుగోడు నియోజకవర్గం నుండి వలస కార్మికులను తిరిగి రప్పించి ఇక్కడి కంపెనీలలో ఉద్యోగాలు ఇవ్వాలని లేదంటే వారికి వలస బంధును ప్రకటించాలన్నారు. గతంలో నార్కట్ పల్లి నుండి ముంబైకి ప్రతిరోజు నడిచిన బస్సులు వెంటనే పునరుద్ధరించి స్లీపర్ బస్సును నడపాలని డిమాండ్ చేశారు. వలస కార్మికుల సౌకర్యార్థం ప్రతిరోజు నడుస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ ను రైలును భువనగిరిలో ఆపాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బుట్ట శివ, కోశాధికారి కత్తుల పరమేష్, మహిళా కన్వీనర్ పద్మ యాదవ్, మస్కు నరసింహ, దోనూరి కృష్ణారెడ్డి, మరి కూడా మండల అధ్యక్షుడు గిరి నరసింహ, కాకుమాను సత్యనారాయణ, గడ్డం కృష్ణ, కత్తుల నరసింహ, మహేష్ రాజు నగేష్ తదితరులు పాల్గొన్నారు.