పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థినులు కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
దిశ ,మిర్యాలగూడ టౌన్ : పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థినులు కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా పదవ తరగతి గదులకు వెళ్ళి విద్యార్ధుల సామర్ధ్యాలను పరిక్షించారు. 10వ తరగతి ఈ -3 సెక్షన్ లో గణితం సబ్జెక్ట్ సంభావ్యతపై విద్యార్థినులను ప్రశ్న ,జవాబులు అడగడమే కాకుండా, బోర్డుపై లెక్కలను వేసి సమాధానాలను రాబట్టారు. మీకు ఏ సబ్జెక్టు అంటే ఇష్టం? ఏ టీచర్ ఇష్టం ?ఎంతమంది హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారని? పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉందని? భోజనం ఎలా ఉందని? తదితర వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమె పాఠశాల వంటగదిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ..రానున్న పదవ తరగతి పరిక్షలల్లో ప్రతిభ చూపాలని కోరారు. పాఠశాలలో వసతుల కల్పన ,భోజన వసతిలలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్ధులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వంటగదిలోకి ,బల్లులు,పురుగులు వంటివి రాకుండా కిటికీలకు మెష్ ఏర్పాటు చేయాలని హెడ్మాస్టర్ విజయ్ కుమారిని ఆదేశించారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్లో ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి ,మండల విద్యాశాఖ అధికారి బాలు,తదితరులు ఉన్నారు.