విశిష్ట సేవలకు రాష్ట్ర స్థాయి “పోలీస్ సేవా పథకం”..
విధుల్లో చూపిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఎల్ల బోయిన జనార్ధన్ కు అరుదైన అత్యుత్తమ గుర్తింపు లభించింది.
దిశ, తుంగతుర్తి : విధుల్లో చూపిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఎల్ల బోయిన జనార్ధన్ కు అరుదైన అత్యుత్తమ గుర్తింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో “సేవా పథకం” లభించింది. ముఖ్యంగా ఆశాఖ ఎంపిక చేసిన అతి కొద్ది మంది ఉద్యోగుల్లో జనార్ధన్ ఒకరు కావడం విశేషం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన జనార్ధన్ 1998 లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఆనాటి నుండి నేటి వరకు ఆయన తన విధుల్లో చూపిన ప్రతిభ అందరి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లోని రీజినల్ పాస్ పోర్ట్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. తొలుత హైదరాబాద్ లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (ఎస్పీపీ) లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన ఆయన 9 ఏండ్లు పనిచేశారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని తిరుమల దేవస్థానం కొండ పై నాలుగేళ్లు విధుల్లో కొనసాగారు. అనంతరం హైదరాబాద్ గవర్నమెంట్ సెంట్రల్ ఫోర్స్ లో విధులు నిర్వహించిన జనార్ధన్ కు 2017 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. అనంతరం ఆయన పాల్వంచలో కేటీపీఎస్ కు బదిలీ అయి అక్కడ 2020 వరకు సమర్థవంతంగా విధులు నిర్వహించారు. తిరిగి బదిలీల్లో భాగంగా రీజినల్ పాస్ పోర్ట్, సికింద్రాబాద్ కు వచ్చారు. గత నాలుగేళ్ల నుండి జనార్ధన్ ఇక్కడే పని చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ జనరల్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సికింద్రాబాద్ వారు ఎంపిక చేసిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల్లో జనార్ధన్ ఒకరు కావడం విశేషం. త్వరలోనే ఆ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా జనార్ధన్ సేవా పథకాన్ని అందుకోనున్నారు. కాగా జనార్ధన్ “సేవా పథకానికి”ఎంపికైన కావడం పట్ల స్వస్థలమైన తుంగతుర్తి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.