గురుకులాలను తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి..

బీబీనగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు.

Update: 2025-01-05 10:03 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బీబీనగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్ లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గురుకులాలలోని గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలలో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యంగా ఉండాలని, బలమైన పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందన్నారు. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి మండలి ప్రత్యేకంగా చర్చించి, విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అని భావించి, వారిని భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో కూడా, అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని 45% డైట్ చార్జెస్ పెంచినట్లు, బాలికల ప్రత్యేక అవసరాల దృష్ట్యా కాస్మోటిక్ చార్జెస్ పెంచినట్లు చెప్పారు. ఇలా పెంచిన డైట్ కాస్మెటిక్స్ చార్జెస్ పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. అవి విద్యార్థులకు ఏ మేరకు అందుతున్నాయా లేదా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తున్నాయా లేదా అనే ఉద్దేశంతో తప్పకుండా తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మంత్రి వర్గమే కాకుండా శాసనసభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ లు అందరికీ బాధ్యతను అప్పగించినట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నెలకు ఒకసారి తప్పకుండా వారితో కలిసి భోజనం చేసి, వారి పరిస్థితులను తెలుసుకొని అవసరాలను తీర్చే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు.


Similar News