లిక్కర్ కేసుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రజలకు ‘‘ధరణి’’ పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
దిశ,తుంగతుర్తి: రాష్ట్ర ప్రజలకు ‘‘ధరణి’’ పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కొంతమంది అధికార పార్టీ నేతలు అధికారుల అండదండతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేయించి ప్రభుత్వంతోపాటు పేదల భూములను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు .ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు,తదితరులతో కలిసి ఇటీవల మాతృ వియోగంతో బాధపడుతున్న పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు గౌతమ్ రావును పరామర్శించారు. అనంతరం తిరుమలగిరి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు
.తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమవ్వడంతోపాటు, పెరిగిపోతున్న మహిళలపై అత్యాచారాలు,అఘాయిత్యాలను నిరసిస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తాను దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా తాను ఏ ప్రాంతంలో పర్యటించినా పేదల నుండి సమస్యలు వెల్లువెత్తుతున్నాయని వివరించారు.ఇందులో ప్రధానంగా ఇండ్ల సమస్య ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు.సీఎం కేసీఆర్ కు నిజమైన చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ప్రజల నుండి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో?ఎంత మంది లబ్దిదారులకు ఇండ్లు పంపిణీ చేశారో ? కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లు ఎన్ని ? అనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడా కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గ్రృహ ప్రవేశం కాకముందే కూలిపోయే స్థితికి చేరాయని,ఇండ్లకు ఎక్కడ చూసినా పగుళ్లు కన్పిస్తున్నాయని అన్నారు.పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వని సీఎం కేసీఆర్ తాను మాత్రం 100 గదులతో రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నాడని సంజయ్ దెప్పి పొడిచారు.
రుణమాఫీ అమలు చేయక రైతుల ఉసురు పోసుకుంటున్నడని దుయ్యబట్టారు.సూర్యాపేట జిల్లాలో ఐకేపీ సెంటర్లలో రూ.20 కోట్ల కుంభ కోణం జరిగినప్పటికీ బాధ్యులపై చర్యలు లేవని మండిపడ్డారు.పండించిన ప్రతి గింజ తామే కొంటామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం చివరికి మాట తప్పిందని,పండించిన ప్రతి గింజకు కేంద్రమే పైసలిస్తోందని సంజయ్ పేర్కొన్నారు.ధరణి నిర్వాహకం వల్ల పేదల భూములు వారి పేర్లపై ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.చివరికి రైతాంగానికి రుణాలు అందలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ధరణి తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారిందన్నారు. పలుమార్లు విద్యుత్తు,ఆర్టీసీ,రిజిస్ట్రేషన్,నల్లా చార్జీలను ప్రభుత్వం పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం చివరికి గ్యాస్ ధరల పెంపు పై సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలుధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.మద్యం ధరలను భారీగా పెంచి ఏటా రూ.40 వేల కోట్లు దోచుకుంటున్నాడని సంజయ్ దుయ్యబట్టారు.కులవృత్తుల మాదిరిగా సీఎం కేసీఆర్ కూతురు లిక్కర్ దందా చేస్తోందని ఆరోపించారు.ఇలాంటివన్నీ ప్రశ్నిస్తే తమపై కేంద్రం కుట్రలకు పాల్పడుతోందని అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం దారుణమన్నారు. లిక్కర్ దందాలో ఎవరున్నా కేంద్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా,తదితరులు పాల్గొన్నారు.