అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మట్టి తరలింపు
మాడుగులపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మట్టి అక్రమ
దిశ,మాడుగులపల్లి : మాడుగులపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మట్టి అక్రమ దందా జోరుగా జరుగుతుంది. పొద్దంతా, రాత్రంతా ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తరలించుకుపోతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఇతర నాయకులు సైతం మట్టి దందాకు పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడే రెవెన్యూ, భూగర్భ శాఖాధికారులకు మామూళ్లు ముట్టజెబుతూ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా మాడుగులపల్లి మండల పరిధిలోని మాడుగులపల్లి అగమోత్కూర్ మధ్య సుందర్ నగర్ నందు ఒక జేసీబీ 5 టిప్పర్ల సాయంతో, లక్షల రూపాయల విలువచేసే మట్టిని రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వ స్థలాల్లో గానీ ప్రైవేట్ భూముల నుంచి మట్టిని తరలించాలంటే తప్పనిసరిగా గనులు, భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు పొందాలి. ఒక క్యూబిక్ మీటర్ మట్టికి 42 రూపాయల చొప్పున సీనరేజీ పన్ను చెల్లించాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలించుకుపోతున్నారు. పగలు రాత్రి తేడా తెలియకుండా ఈ దందా ఎక్కువగా జరుగుతున్నది. జేసీబీలతో మట్టిని తోడి టిపర్లతో ట్రిప్పుకు 5000 రూపాయల నుండి 7000 రూపాయల మధ్య విక్రయించు కుంటున్నారు.
గత రెండు నెలల నుండి వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించుకు పోవడం గమనార్హం. ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతున్న పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి దందాను నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.