రేవంత్‌పై ఏఐసీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఫుల్​ పవర్స్​

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ పవర్స్​ మొత్తం టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి చేతుల్లోకి వెళ్లాయి. ఇక్కడ పార్టీకి సంబంధించిన

Update: 2022-03-25 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ పవర్స్​ మొత్తం టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి చేతుల్లోకి వెళ్లాయి. ఇక్కడ పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ఆయన చేతుల్లోనే పెడుతూ ఏఐసీసీ అనుమతిచ్చింది. పార్లమెంట్​ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న రేవంత్​రెడ్డి.. ఏఐసీసీ అధిష్టానం నుంచి భరోసా తీసుకున్నారు. పలుమార్లు రాహుల్​ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​తో భేటీ అయిన రేవంత్​రెడ్డి.. రాష్ట్ర పరిణామాలన్నీ వివరించారు. తన కార్యక్రమాలకు సీనియర్లు అడ్డు తగులుతుండటం కొంత ఇబ్బందిగా మారిందంటూ ఏఐసీసీకి మొర పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇటీవల జగ్గారెడ్డి తనపై చేసిన ఆరోపణలను, పాత వీడియోల అంశాలను సైతం ఏఐసీసీ పెద్దల దగ్గర ప్రస్తావించారు. ఇప్పటికే సీనియర్ల వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న ఏఐసీసీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రేవంత్​కే కట్టబెట్టింది. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ నుంచే ఈ హామీ ఇచ్చింది. దీంతో రేవంత్​ వర్గంలో కొంత ఉత్సాహం నెలకొంది.

వద్దంటూనే వార్నింగ్​

రాష్ట్రంలోని కొంతమంది సీనియర్లకు ఏఐసీసీ వార్నింగ్​ పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా అంటీముట్టనట్టుగా ఉంటున్న వారితో పాటుగా ఇటీవల బహిరంగ విమర్శలకు దిగుతున్న వారిని సైతం హెచ్చరించింది. అల్రెడీ జగ్గారెడ్డి వ్యవహారంలో జరిగిన అంశాలను సీనియర్లకు హెచ్చరికగా సూచిస్తూనే పార్టీ నేతలు కలిసి వెళ్లకుంటే కష్టమంటూ ఏఐసీసీ నుంచి ఆదేశాలు పంపించారు. వీహెచ్​ మినహా.. కొందరిపై చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఆయనకు క్రమశిక్షణా కమిటీ నుంచి షోకాజ్​ వస్తుందని కూడా టాక్​. అంతేకాకుండా కొద్దిరోజులుగా రేవంత్​ రెడ్డి మీద అసంతృప్తితో రగులుతున్న వారికి కూడా పరోక్ష హెచ్చరికలు పంపించారు. పార్టీ నిర్ణయాల్లో టీపీసీసీ చీఫ్​దే ఫైనల్​ అని, అంతా కలిసి వెళ్లాల్సిందేనంటూ సమాచారమిచ్చారు. అసంతృప్తి నేతలకు కూడా విడుతల వారీగా షోకాజ్​ నోటీసులు వస్తాయని గాంధీభవన్​లో ప్రచారమవుతోంది. కాగా, రాష్ట్రంలోని సీనియర్లతో పాటుగా టీపీసీసీ, అనుబంధ సంఘాలతో త్వరలోనే ఢిల్లీలో సమావేశం నిర్వహించేందుకు ఏఐసీసీ తరుపున ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అందరితో సమావేశమై చివరి హెచ్చరికలు జారీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి.

కలిసి వస్తుందా..?

గతంలో కాంగ్రెస్​ పార్టీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు అవే నడుస్తున్నాయి. అయితే, గతంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక వ్యవహారాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలను ఒక్కరికే అప్పగిస్తే వచ్చిన ఫలితాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. చెన్నారెడ్డి, రాజశేఖరరెడ్డి వంటి నేతలకు కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను అప్పగించడమే కాకుండా.. వ్యతిరేకవర్గం ఏం చేసినా ఏఐసీసీ పెడ చెవిన పెట్టింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​కు కలిసి వచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఏఐసీసీ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

నా ప్లాన్​ నాది

ఇటీవల ఢిల్లీలోనే ఉన్న రేవంత్​రెడ్డి.. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి ఏఐసీసీ నేతలతో పలుమార్లు భేటీ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులన్నీ ఢిల్లీ పెద్దలకు వివరించారు. కేసీఆర్​ పాలనపై రాష్ట్రంలో అసంతృప్తి పెరిగిందని, ఈ పరిణామాలు అందిపుచ్చుకుంటే కాంగ్రెస్​కు కలిసి వస్తాయనే అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే పలు కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్తున్నామని, తాజాగా తీసుకున్న మన ఊరు –మన పోరుకు మంచి స్పందన ఉందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ వివరించుకొచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి కూడా రేవంత్​కు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలోని పరిస్థితులకనుగుణంగా కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, వెంటనే నిరసన కార్యక్రమాలకు వెళ్తున్నామని, ఇలాంటి అత్యవసర ప్రొగ్రాంలపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకునే సమయం ఉండదని, అందుకే స్పీడ్​గా అమలు చేస్తున్నామంటూ ఇటీవల పరిణామాలను పార్టీ పెద్దలకు వెల్లడించారు. ఇలాంటి వాటిపైనా పార్టీ నేతలు తమకు సమాచారం లేదని చెప్పడం, సదరు కార్యక్రమాలకు దూరంగా ఉండటం, బహిరంగ విమర్శలు చేయడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడుతున్నారంటూ వివరించుకొచ్చారు.

కాగా, రాష్ట్రంలో పాదయాత్ర ప్లాన్​ను సైతం రేవంత్​రెడ్డి.. ఏఐసీసీ ముందు ప్రతిపాదన పెట్టారు. త్వరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏఐసీసీ అనుమతితో ఈ కార్యక్రమం చేస్తామని, సమయం తక్కువగా ఉందంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సొంతంగా పాదయాత్ర చేస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఒక్కొక్కరుగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నేతలు కలిసి వచ్చి తన పాదయాత్రకు సహకరించేలా చర్యలు తీసుకోవాలంటూ విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ నుంచి హామీ రాగానే రాష్ట్రంలో పాదయాత్ర ఏర్పాట్లు జరిగే అవకాశాలున్నాయి.

అదేవిధంగా ఇటీవల నిర్వహించిన డిజిటల్​ మెంబర్​షిప్​, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షుల పనితీరుపై కూడా రేవంత్​రెడ్డి సమగ్ర నివేదికను సమర్పించారు. పలు సెగ్మెంట్లలో బలంగా ఉన్నామని, కొంతమందిని ఇప్పటి నుంచే పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తే ఆ సెగ్మెంట్లలో కలిసి వస్తుందంటూ కూడా ఏఐసీసీకి విన్నవించారు.

టార్గెట్​ కేసీఆర్​

కాంగ్రెస్​ పార్టీ కేసీఆర్​ టార్గెట్​గా రాష్ట్రంలో వ్యూహాలు అమలు చేయాలని స్పష్టమవుతోంది. దీనిలో భాగంగానే రేవంత్​రెడ్డికి ఫుల్​ పవర్స్​ ఇచ్చినట్లు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్​ఎస్​ను కాంగ్రెస్​లో విలీనం చేస్తామంటూ హామీ ఇచ్చిన కేసీఆర్​.. రాష్ట్రంలో అదే కాంగ్రెస్​ను కోలుకోలేని విధంగా దెబ్బతీయడంపై అటు ఏఐసీసీ కూడా ఆగ్రహంతో ఉంది. కొంతకాలం కిందట వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని, కాంగ్రెస్​ మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయనే నివేదికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నిర్ణయాలన్నీ రేవంత్​పైనే పెట్టినట్లు అవగతమవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రేవంత్​రెడ్డి వర్గీయులు కొంత దూకుడుగా ఉన్నారు. ఇక రాష్ట్ర పార్టీకి చెందిన ఫుల్​ పవర్స్​ ఆయన చేతికి రావడం, సీనియర్లకు వార్నింగ్​ ఇవ్వడం, వారిలో కొంతమంది కలిసి వచ్చే అవకాశం ఉండటంతో పార్టీ శ్రేణుల్లో కొంత జోష్​ పెరుగుతోంది.

Tags:    

Similar News