కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలి
హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. కలెక్టర్లు ,ఎన్యూమరేటర్లు పకడ్బందీగా నమోదులు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
దిశ సూర్యాపేట కలెక్టరేట్ : హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. కలెక్టర్లు ,ఎన్యూమరేటర్లు పకడ్బందీగా నమోదులు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమైన సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ,కుల సమగ్ర సర్వే ఇంటింటి కుటుంబ సర్వేపై సీఎస్ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలతో కలిసి జిల్లా కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శనివారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు, కలెక్టర్లు దృష్టికి తేవాలని పేర్కొన్నారు. సర్వేపై ప్రజలతో మమేకం అయితే సందేహాలు ఏమిటో తెలుస్తామని తక్షణమే నివృత్తి చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లు కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు భాద్యతగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేల ఆహ్వానించాలని తెలిపారు.
సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడతాయని తెలిపారు. హౌస్ లిస్టింగ్ సర్వే దిగ్విజయంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే ఆసాంతం పూర్తి అయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్నారని భాగస్వామ్యం అయిన కలెక్టర్లను,ఎన్యూమరేటర్లు ను, ప్రణాళికా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. ఎన్యూమరేటర్లకు సర్వే పై. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారని అభినందించారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
మనదేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమాన్ని ,సిబ్బంది నిబద్ధత,అంకితభావంతో సర్వే విజయవంతం చేయాలని అన్నారు. యావత్తు దేశం మన రాష్ట్రం చేపడుతున్న సర్వేను గమనిస్తుందని నిబద్ధతతో పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని వివరించారు. ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని,వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. సర్వే సమాచారం గ్రామస్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు,పట్టణాల ప్రధాన కూడళ్ళలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలోని అధికారులు సర్వే ప్రక్రియ ను పరిశీలిస్తూ.. సిబ్బందికి తగు, సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు.