Union Budget: ఏపీ, బీహార్‌లకు మేలు చేసేందుకే కేంద్ర బడ్జెట్: ఎంపీ మల్లు రవి ఫైర్

కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, జేడీయూలను

Update: 2024-07-23 16:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, జేడీయూలను సంతృప్తి పర్చేందుకు, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడలో ఉండేందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు భారీగా నిధులను కేటాయించిందని ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆ రెండు రాష్ట్రాల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుందని వ్యాఖ్యానించారు. విభజన చట్టం నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పలుచోట్ల ప్రస్తావించినా, తెలంగాణను విస్మరించి ఆంధ్రప్రదేశ్ జపం చేశారని ఆరోపించారు. గంటన్నరకు పైగా సాగిన ఆమె ప్రసంగంలో ఒక్కచోట కూడా తెలంగాణ పదమే పలకలేదన్నారు.

విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోని వెనకబడిన జిల్లాలకు కేంద్రం ఆర్థికంగా సాయం అందించాల్సి ఉన్నప్పటికీ తెలంగాణలోని తొమ్మిది జిల్లాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలకే సాయం చేస్తామని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తన వివక్షను ప్రదర్శించిందని మల్లు రవి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు కేటాయించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తెలంగాణకు కూడా అదే తరహాలో కేటాయింపులు చేయాలనే స్పృహ లేకపోవడం బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మాత్రం మర్చిపోయిందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సాగునీటిపారుదల మంత్రి ఢిల్లీ వచ్చి ప్రధానిని, జలశక్తి మంత్రిని కలిసి విన్నవించినా బడ్జెట్‌లో దాని ఊసే లేకపోవడం రాష్ట్రం పట్ల కేంద్రానికి ఉన్న కక్షను ప్రదర్శించినట్లయిందన్నారు.

తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, ఇద్దరికి కేంద్ర మంత్రిపదవులు దక్కాయని, అయినా తెలంగాణకు దక్కింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు. తెలంగాణ హక్కుల సాధనకు పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కలిసికట్టుగా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ సహా ఎంఐఎం ఎంపీలను కలుపుకుని ఉమ్మడి పొరాటాలపై చర్చిస్తామన్నారు. 


Similar News