వాళ్లు తల్చుకుంటే BRS ప్రభుత్వం కూలడం పెద్ద మ్యాటర్ కాదు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
నవంబర్ 30 ఎన్నికలు, డిసెంబర్ 3 రిజల్ట్స్ మొత్తం కలిపితే కేసీఆర్ లక్కీ నంబర్ 6 వస్తోందని, ఇది బీఆర్ఎస్‌కు కలిసొస్తుందని వారు భావిస్తున్నారని, కానీ ఈసారి
దిశ, తెలంగాణ బ్యూరో: నవంబర్ 30 ఎన్నికలు, డిసెంబర్ 3 రిజల్ట్స్ మొత్తం కలిపితే కేసీఆర్ లక్కీ నంబర్ 6 వస్తోందని, ఇది బీఆర్ఎస్‌కు కలిసొస్తుందని వారు భావిస్తున్నారని, కానీ ఈసారి త్రీ+ త్రీ=సిక్స్.. బీఆర్ఎస్ ఇంటికి పోవడం ఫిక్స్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. గత ఎన్నికల్లో కారు.. సారు.. పదహారు అన్నారని, అప్పుడు కారు షెడ్డుకు పోయిందని, సార్ ఫామ్ హౌజ్‌కు వెళ్లారని, 16 ఎక్కడ పోయిందో వారికే తెలియాలని బండి ఎద్దేవాచేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ రైతు సదస్సుకు ఆయన హాజరయ్యారు. చిక్కడపల్లిలో ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు.
ప్రవళిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయని, తనకోసం ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డారని వారితో ఫోన్‌లో బాధపడిందన్నారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని, వారితో పాటు ఎంపీ లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ వాస్తవాలను తెలుసుకుందామని వెళ్లారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అది నచ్చక పోలీసులతో యువకులపై లాఠీ చార్జీ చేయించారని, లక్ష్మణ్‌ను ఎంపీ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారన్నారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకున్నా ముఖ్యమంత్రి స్పందించడని, కానీ మరొకసారి అవకాశం ఇవ్వాలని ఓట్లు అడుగుతున్నాడని విమర్శలు చేశారు.
బాధిత కుటుంబానికి మనోధైర్యం నింపకుండా లవ్ ఫెయిల్యూర్ అని చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇదేం బతుకు కేసీఆర్ అంటూ బండి మండిపడ్డారు. పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ఆ కుటుంబం కుమిలిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రవళిక లవ్ ఫెయిల్యూర్ వల్లే చనిపోయిందని అబద్ధపు లేఖలు సృష్టించేందుకు కూడా కేసీఆర్ వెనుకాడరని బండి అనుమానం వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉందని, రాష్ట్రంలో నిరుద్యోగులు 50 లక్షల మంది ఉన్నారని, వారంతా కోచింగ్ సెంటర్లు బంద్ చేసి వారి వారి గ్రామాలకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించి బీజేపీకి ఓటు వేసేలా చూడాలని కోరారు.
తమకు 50 రోజుల సమయం ఇస్తే.. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేసే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా కల్పించారు. ఉద్యోగులు, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వం కూల్చడం పెద్ద మ్యాటర్ కాదని పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు కూడా అందించలేని పరిస్థితి ఉందని, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలందరినీ చేతులు జోడించి అడుగుతున్నానని, తమకోసం జైలుకు వెళ్లిన అన్నగా అడుగుతున్నానని బండి తెలిపారు. 50 రోజులు కొట్లాడితే.. ప్రజలందరికీ బీజేపీకి అండగా ఉంటుదన్నారు.
నవంబర్ 30 కేసీఆర్ కు డెడ్ లైన్ కావాలని, కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలని బండి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శలు చేశారు. కర్ణాటకలో రూ.40 కోట్లు దొరికాయని, తెలంగాణ ఎన్నికల కోసం వాటిని తరలించాలనుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అలాగే బోరబండలో బీఆర్ఎస్ పార్టీ నేత ఇంట్లో డ్రగ్స్ దొరికాయని, అవి కూడా ఎన్నికల కోసమే తీసుకొచ్చారని, యువతకు విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అందిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఇకపోతే తెలంగాణ ప్రజల కొంప ముంచింది మొత్తం చేపల పులుసేనని బండి ఎద్దేవాచేశారు. కృష్ణా నదీ జలాల్లో 550 నుంచి 570 టీఎంసీల వాటా తెలంగాణ ప్రాంతానికి రావాలని, కానీ చేపల పులుసు వల్ల తెలంగాణకు 292 టీఎంసీల నీళ్లకే సీఎం కేసీఆర్ సంతకం చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆయన చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా కేసీఆర్ తీరు మారిందని ఫైరయ్యారు. యావత్ దక్షిణ తెలంగాణ ప్రజలను మొత్తం ముంచారని విరుచుకుపడ్డారు.
విభజన సమయంలోనే కేసీఆర్.. పైసలు, కమీషన్లకు లాలూచీ పడి కేవలం 570 టీఎంసీలకు బదులు 292 టీఎంసీలకు సంతకం పెట్టారని ధ్వజమెత్తారు. ఆపై 9 ఏండ్లు కేంద్రానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేఖ రాశారని, కానీ కేంద్రం నుంచి వచ్చిన రిప్లై గురించి మాత్రం ఎవరికీ చెప్పలేదన్నారు. ఈయన ఇలా చేస్తున్నాడని అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే గైర్హాజరయ్యాడని మండిపడ్డారు. కేసీఆర్ 292 టీఎంసీలకు సంతకం పెట్టిన దాన్ని దాన్ని సాక్షాలతో సహా బయటపెట్టామని బండి తెలిపారు. ఈ కేసు కోర్టులో ఉన్నందు వల్ల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేకపోతున్నామని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని, కేసు ఉపసంహరించుకుంటే చేసేందుకు ఆస్కారముందని చెప్పారన్నారు. అలా చెప్పాక కూడా కేసీఆర్ ఏడాది సమయం వృథా చేశారని బండి ధ్వజమెత్తారు.
మొత్తానికి కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే సీఎం కనీసం సంతోషం కూడా వ్యక్తం చేయలేదన్నారు. రైతులు నష్టపోవడమే ఆయనకు కావాలని చురకలంటించారు. కేసీఆర్ నోటి నుంచి ముత్యాలు కాదని, మందు రాలుతుందన్నారు. ఒక్క మోటార్ తో లక్ష ఎకరాలకు నీళ్లు ఎలా పారిస్తాడో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉందని, కేంద్రం రూ.2030 కి కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. కేసీఆర్ రూ.1700కి కొంటామని ఎలా రేటు ఫిక్స్ చేశారని ధ్వజమెత్తారు.
ఎవరికి లాభం చేయడానికి ఈ రేటు ఫిక్స్ చేశారని మండిపడ్డారు. దీని ద్వారా రూ.500 నుంచి రూ.700 కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. ఇవన్నీ.. ప్రగతి భవన్ కు చేరాయని పేర్కొన్నారు. రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి సీఎంవో కార్యాలయంలో పెట్టి ప్రజలను ఎలా దోచుకోవాలని భావించి వారిని నియమించుకున్నారన్నారు. అన్ని ముఖ్య శాఖల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ బండారం మొత్తం బయటపెడుతామని బండి హెచ్చరించారు. రేపో.. ఎల్లుండో.. కేసీఆర్ బయటకు వస్తాడని, రైతు బంధు, ఫ్రీ యూరియా అంటూ మళ్లీ అన్ని అబద్ధాలు చెబుతారన్నారు.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే.. రైతు బంధు ఇవ్వడం పక్కనపెడితే.. ఉన్నది కూడా ఆపేయడం ఖాయమన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో మోటార్లకు మీటర్లు పెడతారని అంటే.. అబద్ధాలు చెప్తే కేసీఆర్ కు మీటర్ పెడతామని హెచ్చరించామని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. నంబర్ వన్ దొంగ, బట్టేబాజ్ అని విమర్శించారు. మోటార్లకు మీటర్లు అని అంటే ప్రగతి భవన్ కు వచ్చి గల్లా పట్టి కొడతామని అంటే.. నోరు మూసుకున్నారన్నారు. రైతులు తలుచుకుంటే.. బీఆర్ఎస్ ను గద్దె దింపవచ్చన్నారు. ధాన్యం కొనుగోలులో గోనె సంచి నుంచి కేసీఆర్ సర్కార్ చేసే బ్రోకర్ పర్సంటేజీ వరకు కేంద్రమే ఇస్తోందని బండి పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వెళ్లే ముందు ప్రజలకు కేసీఆర్ తిన్న చేపల పులుసు గుర్తుకు రావాలని, పట పట పండ్లు కొరికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని బండి కోరారు.