Minister Uttam: స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మారుస్తాం

స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మారుస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-10-15 15:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మారుస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. దీర్ఘకాలిక రుణాలుగా మారిస్తే వడ్డీ భారం తగ్గుతుందని అన్నారు. ఖజానాపై భారం తగ్గి వడ్డీ చెల్లింపుల్లో వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ములుగు, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ఈ రుణాలు వినియోగిస్తామని తెలిపారు. దీర్ఘకాలిక రుణాలతో ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మాటిచ్చారు. అంతేకాదు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని అన్నారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ.. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో... తప్పకుండా గెలుస్తామనుకున్న హర్యానా చేజారిపోవటంతో.. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ అధిష్ఠానం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలను పరిశీలకులగా నియమించింది. ఇందులో.. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.


Similar News