బీజేపీ సభ్యత్వ నమోదు గడువు పెంపు: మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు

బీజేపీ సభ్యత్వ నమోదు గడువును పొడిగించినట్లు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జీ రామచంద్రరావు తెలిపారు.

Update: 2024-10-15 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ సభ్యత్వ నమోదు గడువును పొడిగించినట్లు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జీ  రామచంద్రరావు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 14 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు. మిస్డ్ కాల్స్ ద్వారా వచ్చిన సభ్యత్వాలు కలిపి మొత్తం రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లు ఆయన స్పష్టంచేశారు. వాస్తవానికి మంగళవారంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కావాల్సిందని, కానీ వివిధ కారణాలతో సభ్యత్వ నమోదు గడువును ఈనెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. తొందర్లోనే 50 లక్షల టార్గెట్ ను చేరుకుంటామని ఆయన తెలిపారు. అయితే బూత్ సభ్యత్వ ఫారాలను సేకరించడానికి, జిల్లా స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రస్తుత స్థితిని సమీక్షించడానికి, లక్ష్యాలను సాధించడానికి జిల్లాలవారీగా నేతలకు బాధ్యతలు కేటాయించినట్లు చెప్పారు. ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు జిల్లాల వారీగా ఈ పర్యటనలు ఉంటాయని వివరించారు. ఈ జిల్లాల రివ్యూకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.


Similar News