పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభంపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 4 వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిందేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలిచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 4 వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిందేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలిచ్చారు. శనివారం ఆయన సచివాలయంలో పత్తి కొనుగోళ్ళపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సౌకర్యంగా పంటను విక్రయించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, పత్తి కొనుగోళ్ళ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సీసీఐ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే తేమ శాతంపై కూడా సడలింపులు ఇవ్వాలని సూచించారు. దీంతో రైతులకు మద్ధతు ధర లభించే ఆస్కారం ఉంటుందన్నారు.
రైతులకు ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లింపులు ఇవ్వాలన్నారు. పెండింగ్ చెల్లింపులపై ట్రాకింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా తేమశాతం 8 నుంచి 12 మధ్యలో ఉండేవిధంగా విధించాలన్నారు. పంటను మార్కెట్ కు తీసుకొచ్చేలా రైతులకు సూచించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. వాట్సాప్ చాట్ యాప్ 8897281111 ద్వారా వచ్చిన రైతుల ఫిర్యాదులు రెండు పనిదినాల్లో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పరిష్కరించిన ఫిర్యాదుల సమాచారాన్ని రైతులకు అందజేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి హెడ్ ఆఫీస్, జిల్లా కార్యాలయాలలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే ఈ సెల్ పనిచేయాలని మంత్రి సూచించారు.
మార్కెట్ కమిటీల సెక్రటరీలు, ప్రాంతీయ అధికారులు, ఫీల్డ్ అధికారులు డెవలప్ చేసిన కొత్త యాప్ ను ఉపయోగించి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తూ, నిర్దేశిత సమయాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా రైతు గరిష్ట మద్ధతు ధర పొందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. తేమశాతం ఎక్కువగా ఉన్న పత్తిని ప్రైవేట్ కొనుగోలుదారులకు అమ్మే సమయంలో గరిష్ట ధర పొందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వర్షాలు పడుతున్నందున ముందస్తు చర్యగా మార్కెట్ కమిటీలు రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి, రైతులు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు.