Seethakka: డిమాండ్లకు ఓకే! ప్రభుత్వంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల చర్చలు సఫలం.. సమ్మె విరమణ
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్‌టీ) తో మంత్రి సీతక్క చర్చించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న (Contract residential teachers) కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్‌టీ) తో మంత్రి సీతక్క (Minister Seethakka) చర్చించారు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల ప్రతినిధులతో మంత్రి సీతక్క సచివాలయంలోని తన పేషీలో ఇవాళ భేటీ అయ్యారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు సీఆర్‌టీలు ప్రకటించారు. రేపటి నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా (CRT) సీఆర్‌టీలు వెల్లడించారు. ఉద్యోగ క్రమబద్దీకరణ, మినిమం టైం స్కేల్ మినహా అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ప్రతినెలా ఐదో తారీకు లోపు జీతాలు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చింది. ఉద్యోగ క్రమబద్ధీకరణ, మినిమం టైం స్కేల్ డిమాండ్లపై సీఎంతో చర్చించి మరోసారి సమావేశం అవుదామని మంత్రి సీతక్క చెప్పారు. ఆదివాసీ గిరిజన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సీతక్క వారిని కోరారు. పదేళ్లుగా మీ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి.. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సీఆర్‌టీ సేవలను పొడగిస్తూ ఇప్పటికే ముఖ్య మంత్రి ఫైల్ పై సంతకం చేశారని మంత్రి సీతక్క గుర్తు చేశారు.