ధరణి ప్రక్షాళన దిశగా తెలంగాణ సర్కార్.. త్వరలో శ్వేతపత్రం విడుదల
ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్తు శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్తు శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్‌లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచనరహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికి ఒక కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును కొల్లగొట్టారో త్వరలో ప్రజల ముందు పెట్టబోతున్నామన్నారు. భూ రికార్డులకు శరాఘాతంగా పరిణమించిన ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో “తెలంగాణ పునర్నిర్మాణం” పై నిర్వహించిన సెమినార్ లో మంత్రి ప్రసంగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూశాఖ, ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి మార్చి 1వ తేది నుండి 7వ తేది వరకు ఎమార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాన్ని విభజిస్తే, రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిసి కూడా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సోనియాగాంధీ నెరవేర్చారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, అసెంబ్లీ లో అప్పటి కేసిఆర్ కూడా ప్రకటించారని చెప్పారు. నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో తీరని నష్టం జరిగిందన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో అశ్రద్ధ వహించారని, చిత్తశుద్ధిగా వ్యవహరించలేదని, నిరుద్యోగ కుటుంబాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, ఒక క్యాబినెట్ మంత్రి అవహేళనగా మాట్లాడారు. అప్పటి ప్రభుత్వ విధానాలతో స్వార్థంకోసం టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీలతో నిరుద్యోగ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని అన్నారు.