ధరణి అక్రమాలపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
ధరణి పోర్టల్‌లో ఎలాంటి తప్పులు లేవని అప్పటి ప్రభుత్వ పెద్దలు బుకాయించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు..
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌లో ఎలాంటి తప్పులు లేవని అప్పటి ప్రభుత్వ పెద్దలు బుకాయించారని, వారికి ఇష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తయారు చేసి బీసీ, ఎస్టీ, ఎస్టీ పేదల భూములను తన్నుకుపోయారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై మాట్లాడారు. ధరణి పోర్టల్ ద్వారా చోటు చేసుకున్న సమస్యలను వివరిస్తూ.. రెండు పిట్టలు, ఒక కోతి, రొట్టె ముక్క కథను చెప్పారు. భూ భారతి చట్టం భూమి ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టం అవుతుందన్నారు. దేశంలోనే భూ సంస్కరణలు తీసుకొచ్చిన అతి కొద్ది మంది నేతల్లో తెలంగాణవారే ఆధ్యులన్నారు. అందులో పీవీ నర్సింహారావు భూ కమతాల చట్టం, బూర్గుల రామకృష్ణారావు కౌలు రైతుల రక్షణ చట్టం, కొండా వెంకటరంగారెడ్డి జాగీర్దార్ రద్దు చట్టాలు వచ్చాయని గుర్తు చేశారు. రైతులకు భరోసా కల్పించే చట్టాన్ని, దేశానికి రోల్ మోడల్‌గా ఉండే చట్టాన్ని తీసుకొచ్చామన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం వేలాది మంది రైతులు పాల్గొన్న ఘట్టాలు తెలంగాణ సొంతం. నాలుగు గోడల మధ్య కూర్చొని చట్టాలు చేసి తప్పు చేసింది దొర వారైతే, అన్యాయం మాత్రం రైతులు అనుభవిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాకు చెందిన మద్దెల కృష్ణయ్య అనే రైతు భూ సమస్యతో ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. 35 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని ధరణి కారణంగా రికార్డుల్లో తారుమారు చేస్తే 2023 జనవరి 23న 70 ఏండ్ల వయసులో చనిపోయారన్నారు. అలాంటి కృష్ణయ్యలు వేలాది మంది బాధితులు ఉన్నారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.