TG Assembly: భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

భూభారతి బిల్లు(Bhu Bharati Bill)కు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదించింది.

Update: 2024-12-20 10:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికే తలమానికంగా రూపొందించిన తెలంగాణ భూ భారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్లు, 2024)కి శుక్రవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సామాన్య రైతులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ చట్టాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూడు రోజుల తర్వాత అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించారు. చర్చలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభ్యులు పాల్గొన్నారు. చట్టంపై పలు సూచనలను చేశారు. అంతకు ముందే పొంగులేటి ఉద్దేశ్యాలు, లక్ష్యాలను సభకు వివరించారు. ఇందులో సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు కూడా అందించే వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఐతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా భూ మాతకు బదులుగా 2024లో యూపీఏ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డుల అప్ డేషన్ కార్యక్రమానికి పెట్టిన భూ భారతి అని చట్టానికి పేరు పెట్టారు.

భూ మాత కంటే ఈ పేరే బాగుందన్న అభిప్రాయపడ్డారు. అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో భూ భారతి కింద పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించిన విషయం తెలిసింది. ఐతే ఈ చట్టం రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రత్యేక చొరవను చూపారు. 20 సార్లకు పైగానే ఉన్నత స్థాయి సమీక్ష చేసిన విషయం తెలిసిందే. ప్రతి సెక్షన్ పై సునిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి క్లాజ్ పైనా, ప్రతి కొత్త అంశంపైన తలెత్తే న్యాయపరమైన చిక్కుల గురించి ఆరా తీశారు. చట్టం అమల్లోకి వస్తే అమలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ భూమి హక్కుల రికార్డుల బిల్లు, 2024 డ్రాఫ్ట్ ని ఆగస్టు నెలలోనే రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి నుంచి అభ్యంతరాలను, సూచనలను స్వీకరించి చేర్పులు, మార్పులు చేయడం గమనార్హం. ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, బి.వినోద్ రావులు కూడా పాల్గొన్నారు.

వారిచ్చిన సూచనలను కూడా చేర్చినట్లు మంత్రి ప్రకటించారు. ఐతే గతంలో ఆర్వోఆర్ 2020కి రూల్స్ ఫ్రేం చేయలేదు. మూడేండ్లయినా సర్క్యులర్లతోనే కాలం వెళ్లదీశారు. అందుకే అనేక భూ సమస్యలు జటిలంగా మారాయి. ఇప్పుడు మాత్రం భూ భారతికి మూడు నెలల్లోనే రూల్స్ ని ఫ్రేం చేసి అమల్లోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించడం గమనార్హం. 23 సెక్షన్లతో ఈ చట్టం అమల్లోకి రానున్నది. ఆర్వోఆర్ 2024 చట్టాన్ని తయారు చేయడంలో రెవెన్యూ చట్టాల నిపుణులు ఎం.సునీల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. గడిచిన 10 నెలలుగా ఎంతగానో శ్రమించారు. వందల సార్లు అధికారులు, మంత్రులు, రైతులతో సంప్రదింపులు చేశారు. అలాగే సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డి, రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిలు ఆర్వోఆర్ చట్టం తయారీలో పాల్గొన్నారు.

Tags:    

Similar News