కేసీఆర్ ప్రాణం ఆయన చేతుల్లో ఉంది.. అసెంబ్లీలో CPI MLA హాట్ కామెంట్స్
ధరణి పేరుతో భూమాతను బంధించారు.. రైతులను బంధించారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పేరుతో భూమాతను బంధించారు.. రైతులను బంధించారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరణిని ప్రవేశపెట్టిందని, చర్చపెట్టకుండా కుట్ర చేశారని అర్ధమవుతుందన్నారు. అసెంబ్లీలో శుక్రవారం భూభారతిపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన కూనంనేని.. పదేళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజల గొంతు నొక్కేశారని మండిపడ్డారు. నాడు అధికారంలో ఉండి.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడనివ్వడం లేదని.. మా గొంతు నొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు? అని నిలదీశారు. కేసు కేటీఆర్ ఒక్కరిపై పెట్టలేదన్నారు. తప్పుడు కేసు పెట్టారని కేటీఆర్ భావిస్తే గాంధీ విగ్రహం దగ్గర నిరాహారదీక్ష చేయవచ్చు కదా? అలా చేస్తే కనీసం సానుభూతి అయినా వస్తుందని అన్నారు. మీ ఒక్కరి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందా? నేను సైతం జైలులో దీక్ష చేశానని స్పష్టం చేశారు. సభను సజావుగా నడవనివ్వాలని, నాలుగుకోట్ల ప్రజల హక్కులు కాలరాయొద్దని సూచించారు. కేసీఆర్ ప్రాణం సోమేష్ కుమార్ చేతిలో ఉందని.. గొంతుపిసికారన్నారు. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాల్లో గెలిచిందని, ధరణి వల్ల రూరల్ ప్రాంతాల్లో విజయం సాధించలేదన్నారు.
భూభారతి బిల్లులో కాస్తుకాలం ఉండాలని లేకుంటే కొత్తగా జమిందార్లు పుట్టుకొస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అసైన్డ్ , ఇనాం భూములకు పట్టాలివ్వాలని, ఆలయ, వక్ఫ్ భూములకు సైతం కాస్తుకాలం పెట్టాలని సూచించారు. సాదాబైనామాల గడువును 2023 డిసెంబర్ వరకు పెంచాలని కోరారు. 5 ఎకరాలలోపు అసైన్డ్ భూములు సాగుచేసుకుంటుంటే రిజిస్టర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అగ్రికల్చర్, నాన్ అగ్రిక్చర్ కు వేర్వేరుగా రికార్డులు ఏర్పాటు చేయాలని, ఎల్ఆర్ఎస్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. కోనేరురంగారావు సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. విభజన సమయంలో 5 గ్రామాలు ఆంద్రలో కలిశాయని వాటిని వెనక్కి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ భుముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.