TG Budget: బడ్జెట్‌పై పిన్‌డ్రాప్ సైలెన్స్.. మినిస్టర్ల తీరుపై కేడర్‌లో అసహనం

బడ్జెట్‌పై మంత్రులు ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Update: 2025-03-21 02:17 GMT
TG Budget: బడ్జెట్‌పై పిన్‌డ్రాప్ సైలెన్స్.. మినిస్టర్ల తీరుపై కేడర్‌లో అసహనం
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌పై మంత్రులు ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తే.. మంత్రులు మౌనంగా ఉంటడం ఏంటీ? అని కేడర్ ప్రశ్నిస్తున్నది. కొందరు మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా ప్రెస్‌ నోట్స్ రిలీజ్ చేశారు. చివరికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సైతం నోట్ విడుదల చేసి కామ్‌గా ఉండటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రులే ముందుకు రాకపోతే ఎలా?

వై.ఎస్.రాజశేఖర‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మంత్రులు, విప్‌లు వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, పద్దులోని కీలక అంశాలను ప్రజలకు వివరించేందుకు పోటీలు పడేవారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని ప్రశంసించేవారు. కాని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు విప్‌లు మాత్రమే మాట్లాడారు. మినిస్టర్లు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చేందుకు చొరవ చూపలేదు. కేవలం మహిళా మంత్రులు సురేఖ, సీతక్క మాత్రం ప్రెస్ నోట్స్ రిలీజ్ చేశారు. సొంత ప్రభుత్వాన్ని మంత్రులే సమర్థించకపోతే ఎలా? అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కుదరకపోతే తెల్లారి అయిన మీడియా ముందుకు ఎందుకు రాలేదని నిలదీస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రశంసించేందుకు సమయం దొరకలేదా? అందుకే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మౌనంగా ఉన్నారా? అని కేడర్ ప్రశ్నిస్తున్నది.

Tags:    

Similar News