జగిత్యాల ఆర్డీవో ఆఫీస్‌లో సెంట్రల్ ఐటీ ఆఫీసర్ల తనిఖీ
జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో ఐటీ ఆఫీసర్లు రికార్డుల తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో ఐటీ ఆఫీసర్లు రికార్డుల తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గంటల తరబడి రికార్డులను పరిశీలించిన అధికారులు గతంలో టీడీఎస్ పేరుతో జగిత్యాలకు చెందిన ఓ ఇన్ కమ్ టాక్స్ కన్సల్టెంట్ రూ.లక్షల మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్టుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. జగిత్యాల శివారులోని లింగంపేట రైల్వే స్టేషన్ ఏర్పాటుకు గతంలో అధికారులు స్థానిక రైతుల నుంచి భూసేకరణ చేపట్టారు. ఈ క్రమంలో భూములు కోల్పోయిన రైతులు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం విషయంలో కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు రూ.10 లక్షల పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సూచించింది. అయితే ఆదాయానికి మించి పరిహారం ఉండడంతో ఓ ఇన్ కమ్ టాక్స్ కన్సల్టెంట్ టీడీఎస్ స్కామ్‌కు పాల్పడ్డాడు.
ఇతరుల పాన్ నంబర్లతో రూ.లక్షలు క్లెయిమ్..
ఒక రైతుకు వచ్చే నష్టపరిహారం స్థానంలో మరో నలుగురిని రైతులుగా చూయించి ఆర్థిక మోసానికి తెర లేపాడు. జగిత్యాల రూరల్ మండలంలోని అంబర్ పేట గ్రామ రైతులతో పాటు మరికొందరి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసే క్రమంలో పాన్ నంబర్ లేనటువంటి రైతులకు ఇతరుల పాన్ నంబర్లు సృష్టించి పెద్ద ఎత్తున డబ్బులు నొక్కేసి నట్లుగా సమాచారం. రైతులకు చెందాల్సిన టీడీఎస్ బిల్లులను జగిత్యాలకు చెందిన ఓ టాక్స్ కన్సల్టెంట్ నిర్వాహకుడు తనకు సంబంధించిన వారి అకౌంట్లోకి మళ్లించినట్లు తెలిసింది. అయితే ఈ బిల్లులను గతంలో ఆర్డీవోగా పని చేసిన ఓ ఆఫీసర్ ట్యాన్ నంబర్ తో క్లెయిమ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పదంగా ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లు గుర్తించిన సెంట్రల్ ఐటీ ఆఫీసర్లు ఈ క్రమంలోనే జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ లో అందుకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసేందుకే వచ్చినట్లు కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తెలిసిన వాళ్లేనని పాన్ నంబర్ ఇచ్చి..
ఈ మొత్తం వ్యవహారంలో సదరు టాక్స్ కన్సల్టెంట్ తనకు పరిచయం ఉన్న వారి పాన్ కార్డు నంబర్లను రైతుల అకౌంట్లుగా చూపించి మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయించుకునే వారితోపాటు మరికొందరు తెలిసినవాడే కదా అని పాన్ కార్డు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆ పాన్ కార్డుల ద్వారా అప్పటి ఆర్డీఓ ట్యాన్ నంబర్ ద్వారా రూ.లక్షలు క్లెయిమ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇలా ఇతరుల పాన్ నంబర్ల ఆధారంగా డబ్బు క్లెయిమ్ చేసి తర్వాత వాటిని విత్ డ్రా చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో చాలామంది అసలు తమకు తెలియకుండానే ఇందులో పావులుగా మారారు. ఇదిలా ఉండగా ఐటీ ఆఫీసర్ల రికార్డుల వెరిఫికేషన్ తర్వాత అసలు నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.