Harish Rao: ఎన్ని కేసులు పెట్టినా నీ వెంట కేటీఆర్ పడుతూనే ఉంటారు
కేటీఆర్ చేసిన తప్పేంది.. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును హైదరాబాదుకు తెచ్చినందుకా?, గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్
దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ చేసిన తప్పేంది.. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును హైదరాబాదుకు తెచ్చినందుకా?, గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్‌ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్ మెంట్స్‌కి డెస్టినేషన్‌గా మార్చాలనుకున్నందుకా? అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, కేటీఆర్ నీ వెంటపడటం మానరు, నీ బండారం బయటపెట్టడం ఆపరు అని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో ఇది డొల్ల కేసు అని తేటతెల్లమైందన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని, గోబెల్స్ ప్రచారం చేశారన్నారు. ఈ కారు రేసింగ్‌పై సభలో చర్చ జరపాలని అడిగామని, వాస్తవాలు ప్రపంచానికి చెబుదాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలని కోరామన్నారు. మిమ్మల్ని బయటకు పంపి సభలో చర్చ కొనసాగించారని, కేసు పెట్టవద్దు అని మేం అడగటం లేదు, చర్చ పెట్టండి అని అడిగామన్నారు. ఎందుకు ఒప్పుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియవద్దా? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసులో 600 కోట్ల అవినీతి అంటూ సీఎం అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు.
మిగతా 50శాతం చెల్లించకపోవడం వల్ల రద్దు చేసుకుంటున్నాం, అందుకు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని, అని సదరు సంస్థ చెప్పిందన్నారు. 45లక్షల పాండ్స్ అంటే సుమారు 47 కోట్లు అని, కానీ రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం అంటున్నారు. మేం సభలో లేకుంటే శుద్ధ తప్పులు చెప్పాడన్నారు. వాస్తవానికి 700 కోట్ల లాభం రాష్ట్రానికి జరిగిందన్నారు. రేవంత్ తుగ్లక్ పనుల వల్ల, పిచ్చి పని వల్ల 700 కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగింని వెల్లడించారు. రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్దం అని, రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బ తీశాడన్నారు. అసలు కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అవినీతి జరగలేదు, మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టిందన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి, నేషనల్ బ్యాంకు నుంచి ఆ సంస్థకు డబ్బులు పంపారు... ఇందులో అవినీతి ఏముంది అని నిలదీశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న అవినీతి జరగలేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అన్నారన్నారు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు.
ప్రభుత్వం మీద గట్టిగ మాట్లాడితే చాలు కేసులు.. ఇచ్చిన హామీలు ఏమైనయి అంటే అరెస్టులు.. రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలిపినా నిర్బంధాలు అని మండిపడ్డారు. ఏం చేసిండు కేటీఆర్..నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు బయటపెడుతున్నడు.. నీ స్కాంలను, నీ స్కీంలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నడు.. నీతో సహా నీ బ్రదర్స్, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి మీకు నిద్ర లేకుండా చేస్తున్నడు.. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీ ఆర్ ఆర్ బ్రదర్స్ గురించే ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అని ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండన్నారు.. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో నువ్వు చేస్తున్న లూటిఫికేషన్ ను బయటపెట్టిండన్నారు. ఇవన్నీ చేయడంతోనే నీకు వశపడక... ఏదో ఒక కేసు పెట్టాలే, ఎట్లనైనా జైల్లో వేయాలనే కుట్రకు కొన్ని నెలలుగా తెరలేపినావు అని, అరెస్టులతో లీడర్లను, క్యాడర్‌ను భయబ్రాంతులకు గురిచేసి నీ కుంభకోణాలను, లంబకోణాలను యథేచ్చగా కొనసాగించుకోవాలని చూస్తున్నావని మండిపడ్డారు.
డైవర్షన్‌లో భాగమే కేటీఆర్ మీద పెట్టిన కేసు అని ధ్వజమెత్తారు. ఈ రేవంత్ రెడ్డికి అటు విజన్ లేదు, ఇటు విజ్ డమ్ లేదన్నారు. ఆయన అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ ప్రతిష్ఠ దిగజారే పరిస్థితి వచ్చిందన్నారు. అప్పులు అప్పులు అని దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రం అన్నాడన్నారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా పోయినయి. ఉద్యోగ కల్పనకు దిక్కు లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్లం.. వెనుకడుగు వేసిది లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యారని ఆరోపించారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడం.. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని వెల్లడించారు.