Hero Aditya Om Social Service నువ్వయ్యా రియల్ హీరో.!
తెలుగు ప్రజల మేలుకోరుతున్న హీరో ఆదిత్య ఓం సేవాగుణంపై స్పెషల్ స్టోరీ..!
ప్రజల సొమ్మును బెనిఫిట్ షోలుగా మార్చుకునేవాడు కాదు..
ప్రజలకు బెనిఫిట్ చేసేవాడే హీరో.!
ప్రేక్షకుల ప్రాణాలతో చెలగాటమాడేవాడు కాదు..
ప్రేక్షకులకు ప్రాణభిక్షపెట్టేవాడే రియల్ హీరో.!
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడే అతడే ఆ రియల్ హీరో.
పేరు ఆదిత్య ఓం.
ఏవో కొన్ని చిన్నా చితకా సినిమాలే చేశాడు.
కానీ, పెద్ద మనసున్నోడు.
పేదల మనసు తెలిసినోడు.
తెలుగు ప్రజల మేలుకోరుతున్న యంగ్ హీరో ఆదిత్య ఓం సేవాగుణంపై స్పెషల్ స్టోరీ..!
- దాయి శ్రీశైలం
పాన్ ఇండియా హీరోలు.. పాన్ మసాలా హీరోలకు కాదు.. ప్రేమను పంచే హీరోలకు మనవాళ్లు కటౌట్లు.. బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేస్తే బాగుంటుంది. వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. దాంట్లో నుంచి వందల రూపాయల మేలైనా మనకు చేస్తారా.? మరి ఇల్లూ, కుటుంబం, పనీ వదిలేసి జేజేలు కొట్టడమెందుకు.? ప్రీపియర్ల షోల వెంట పరుగులు తీసి ప్రాణాలు పోగొట్టుకోవడమెందుకు.?
ట్రైలర్ రాకపోతే సచ్చిపోతరా.?
సోషల్ మీడియాలో ఒక లెటర్ చక్కర్లు కొడుతోంది. అది గేమ్ ఛేంజర్ సినిమా గురించి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన హార్డ్ కోర్ ఫ్యాన్ రాసిన ఆత్మహత్య లేఖ అది. గమ్మతే ఉంది కదా.? అలా తయారయ్యారు మనొళ్లు. పాపం.. మనోడు చాలా రోజులుగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నాడట. అతగాడి ఎదురుచూపులను ఎవరూ అర్థం చేసుకోవడం లేదటా. పాపం.. ఎంతకనీ ఎదురుచూస్తాడు చెప్పండీ. కొత్త సంవత్సరం లోపు గేమ్ ఛేంజర్ ట్రైలర్ వదలకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు ఆ వీరాభిమాని. ఇట్లు మీ ఈశ్వర్ అని సూసైడ్ లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హార్డ్ కోర్ అభిమానిపై నెట్టింట్లో దుమ్మెత్తిపోస్తున్నారు. బుద్ధుండాలెకదా.. సచ్చిపోరా సచ్చిపో.. ఈ భూమికి భారమన్నా తగ్గుతుంది అని తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఇప్పుడు కొట్టండయ్యా చప్పట్లూ.!
ఆదిత్య ఓం తెలుసు కదా.? 2002లో లాహిరి లాహిరి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభం బాగానే ఉన్నా హిట్లు పెద్దగా పడలేదు. అనుకున్నంత ఆశాజనకంగా కెరీర్ సాగలేదు. ఈ మధ్య బిగ్‌బాస్ షో ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాలదేముందీ బ్రో.. ప్రజలతో అనుబంధం ఉండాలి అనంటాడు ఆదిత్య. హీరోగా నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులకు తనవంతు సాయం చేయాలని సంకల్పించాడు. ఫొటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకోవడం లాంటి సేవ కాకుండా తనపేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనుకున్నాడు. చెరుపల్లి అనే గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడు. సినిమావాళ్లు గ్రామాలను దత్తత తీసుకోవడం కొత్తేం కాదు కదా అంటారా.? కరక్టే కానీ ఆదిత్య పెద్ద పెద్ద సినిమాలు చేసి, వందల కోట్లు సంపాదించిన హీరోయేం కాదు. ముఖ్యంగా మన ప్రాంతంవాడు అస్సలు కాదు. అయినాకూడా తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలనుకున్నాడు చూడూ.. అదీ అతడి గొప్పదనం. చప్పట్లు కొట్టి, కటౌట్లు కట్టాల్సింది ఇతడికి కదా.?
ఏం చేశాడంటే.?
చెరుపల్లిలో ప్రజలు కలుషిత నీటిని తాగుతున్నారనీ, దానివల్ల తీవ్రమైన రోగాలు, నొప్పుల బారిన పడుతున్నారని తెలుసుకున్నాడు ఆదిత్య. అయ్యో పాపం కదా అని చలించిపోయాడు. ఏదో రకంగా చెరుపల్లి ప్రజలకు మేలు చేసి తీరాలి అనుకున్నాడు. స్థానికులను సంప్రదించి గ్రామంలో ఉన్న సమస్యలేంటో తెలుసుకున్నాడు. ప్రధాన సమస్యయిన తాగునీటి సమస్యను తీర్చేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటుచేయాలని సంకల్పించాడు. అనుకున్నదే ఆలస్యం ఆర్వో ప్లాంటుకు శ్రీకారం చుట్టాడు. ఒక్క చెరుపల్లికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచినీటి సౌకర్యం అందించాలని ప్లాన్ చేశాడు. సంక్రాంతిలోపు అది ఓపెనింగ్ కాబోతుంది. ఆరోగ్యంతో పాటు విద్య, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని లైబ్రరీని నిర్మించాడు, డిజిటల్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాడు. చదువుకునే పిల్లలకు ల్యాప్‌టాప్‌లు అందించాడు. ఊరంతా సోలార్ లైట్లను ఏర్పాటు చేయించాడు. మొత్తానికి చెరుపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం అతడిది.
రియల్ హీరో కదా.!
ఆదిత్యది ఉత్తరప్రదేశ్. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్. తల్లి పొలిటీషియన్. ఆదిత్య బంధువులంతా బ్యూరో క్రాట్స్, జడ్జిలే. ఆదిత్యకేమో సినిమాలపై ఆసక్తి. సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ఎడ్యులైట్మెంట్ అనే సేవాసంస్థను ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. తమ ప్రాంతంవాడు కాకపోయినా సమస్య ఏంటో తెలుసుకొని గ్రామాన్ని దత్తత తీసుకున్న మంచి మనసున్నోడని చెరుపల్లి గ్రామస్తులు ఆదిత్యను కీర్తిస్తున్నారు. ఆయనే రియల్ హీరో అని మెచ్చుకుంటున్నారు. ఆదిత్యలాంటి రియల్ హీరోలను ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఒక్క సమస్యా ఉండదనేది వారి అభిప్రాయం. ఇక నెటిజన్లయితే ఆదిత్యను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టి మొఖం చాటేసే పాన్ ఇండయా స్టార్లతో పోలిస్తే ఆదిత్య ఓం చాలా బెటరని కితాబిస్తున్నారు. రీల్ హీరోల మాయలో పడి ఆదిత్యలాంటి రీల్ కమ్ రియల్ హీరోలను మర్చిపోవద్దని హార్డ్ కోర్ అభిమానులను హెచ్చరిస్తున్నారు.
అసలేంటయ్యా మీరూ.?
మంచి చేస్తున్నోడిని పట్టించుకో చేతగాదుగానీ, ఎక్కడపడితే అక్కడ ఒర్లుడు నేర్చుకున్నారు మన ప్రేక్షక మహాశయులు. వేరే ఎవరో కాదు, పవన్ కల్యాణే ఆ మాటన్నాడు. అన్నమయ్య జిల్లా ఎంపీడీఓ జవహర్ ఒక ఘటనలో గాయపడి కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఎంపీడీఓను పరమార్శించడానికి పవన్ కల్యాణ్ వెళ్లాడు. ఆయనేదో సీరియస్ టాపిక్ మాట్లాడుతున్నాడు. అభిమానులకు ఇదేదీ పట్టదు కదా.? ఓజీ ఓజీ ఓజీ అని ఒక్కటే ఒర్లుడు షురూ చేశారు. చిర్రెత్తిపోయిందో ఏమో.. అసలేంటయ్యా మీరూ.. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదు.. పక్కకు రండీ అని గరమయ్యాడు పవన్. ఇప్పుడే కాదు చాలాసార్లు ఇలానే జరిగింది. ఏ హీరో అభిమానులైనా కావచ్చు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఒర్లడం కాకుండా.. కాస్త ఆదిత్య ఓం లాంటి సేవాగుణమున్న హీరోలను కూడా పట్టించుకుంటే మంచిదంటున్నారు నెటిజన్లు. రీల్ హీరోలకే కాదు, రియల్ హీరోలను ఆరాధించండయ్యా అని సూచన చేస్తున్నారు.
సామాజిక స్పృహ
ప్రేక్షుకులే దేవుళ్లు.. వాళ్ల దయవల్లనే ఈ స్టేజీకొచ్చాం.. లాంటి ఉత్త ప్రసంగాలు కాకుండా సామాజిక స్పృహతో సినీ హీరోలు ఆలోచించాలి. ప్రేక్షకుల ద్వారా సొమ్ము చేసుకుంటున్నప్పుడు వారికి ఏదో రూపంలో సాయం చేస్తే మంచిది. సినిమాలతో పాటు సామాజిక స్పృహ ఉంటే ఎలాంటి తొక్కిసలాటలు జరగవు. ఏ అభిమాని ప్రాణం గాల్లో కలిసిపోదనేది సోషల్ మీడియా చర్చ.
ఓ అభిమానీ.. నిన్నే
హీరోకే కాదు, సగటు అభిమానికి కూడా సామాజిక సోయి ఉండాలి. పాన్ ఇండియా స్టార్లమని చెప్పుకొని పైసా ఫాయిదా చేయని వాళ్లకు కాదు, సంపాదించిన కాస్తో కూస్తో ఏదో ఒక రూపంలో ప్రజలకు ఖర్చు చేస్తున్న ఆదిత్య ఓం లాంటి హీరోలకు ఉండాలి ఆర్మీలు, సోల్జర్లు. ఒక ట్రైలర్ కోసం ఆత్మహత్య చేసుకుంటారా.? ట్రైలర్ ఆలస్యమైతే కొంపలు మునిగిపోతాయా.? అని కొందరి అభిప్రాయం.
పర్యావరణ హితం
ఆదిత్య ఓం ప్రస్తుతం బంధీ సినిమాలో నటిస్తున్నాడు. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన సందేశం ఈ సినిమాలో ఉంటుందట. గ్రామాన్ని దత్తత తీసుకున్నంత మాత్రాన ఆదిత్య అందరికంటే గొప్పోడైపోతాడా అనేవాళ్లూ ఉండొచ్చు. కానీ చిన్నహీరోనే అయినా పాన్ ఇండియా స్టార్లు, గ్లోబల్ స్టార్లు చెయ్యలేని పనిని చేయడం గొప్ప విషయమే కదా అంటున్నారు నెటిజన్లు.