ఆ కల సాకారం కాలేదు.. కేంద్రంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం
బీజేపీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కల నేరవేరలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు....
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కల నేరవేరలేదని రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకు వచ్చి బస్తీలు అద్దె ఇళ్ళలో ఉండేవారి సొంతింటి కలను నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదు సంవత్సరాల్లో దేశంలోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని బీజేపీ 2014, 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. పదేళ్లు గడిచినా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించారు. ఇప్పుడు లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఐదేళ్ళల్లో రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడం లబ్ధికోసమేనని చెప్పారు. పేదవారికి న్యాయం చేయాలన్న ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సామాన్యుడి వేదనను మోదీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని పొంగులేటి దుయ్యబట్టారు