Minister Konda Surekha: మానవ పరిణామక్రమానికి అడవులు సాక్షిభూతం: మంత్రి కొండా సురేఖ

మానవ పరిణామక్రమానికి అడవులు సాక్షిభూతంగా నిలిచాయని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Update: 2024-09-10 15:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మానవ పరిణామక్రమానికి అడవులు సాక్షిభూతంగా నిలిచాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. అడవులతో మనిషికి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని, ఆ అనుబంధమే పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించేలా వారిని ప్రోత్సహించిందన్నారు. ఈ నెల 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల కృషిని ప్రశంసించారు. అడవుల సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు త్యాగాలను స్మరించుకున్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

దేశ సహజ వనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారన్నారు. దేశ చరిత్రలో 18వ శతాబ్ధం ఆరంభంలో ఖెజార్లి గ్రామంలో చెట్ల నరికివేతను నిరసిస్తూ, జోధ్ పూర్ రాజుకు వ్యతిరేకంగా బిష్ణోయి తెగకు చెందిన వ్యక్తుల తిరుగుబాటుతో మొదలైన ఉద్యమం తర్వాత కాలంలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం, అప్పికో ఉద్యమం, జంగిల్ బచావో ఆందోళన్, చిప్కో ఉద్యమం వంటి అటవీ సంరక్షణ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. నేటికీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులు అటవీ సంపద రక్షణకు, అడవుల పునరుద్ధరణకు గొప్ప సంకల్పంతో పోరాడుతున్నారని కీర్తించారు.

అడవుల సంరక్షణలో భాగంగా రాష్ట్రంలో విధి నిర్వహణలో 22 మంది అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోడం అత్యంత బాధాకరమన్నారు. అడవుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కార్యాచరణ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సఫలమైందని స్పష్టం చేశారు. వన మహోత్సవంతో రాష్ట్ర అటవీ సంపదను 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే మహా యజ్ఞంలో భాగస్వాములైన అటవీ ఉద్యోగులు, సిబ్బంది తెలంగాణను బృందావనంగా మార్చే దిశగా కార్యదక్షతతో పని చేయాలని ఆకాంక్షించారు.

పచ్చదనం పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అమరవీరుల ప్రేరణతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అటవీ శాఖను బలోపేతం చేసే దిశగా అవసరమైన ఉద్యోగులు, సిబ్బంది నియామకం పై కసరత్తు చేస్తున్నదని తెలిపారు. అట‌వీ భూములు అన్యాక్రాంతం కాకుండా, అడవుల నరికివేతకు అడ్డుకునే దిశగా ప‌కడ్బందీ చర్యలు తీసుకునేందుకు అటవీశాఖను సర్వసన్నద్ధం చేసే దిశగా అటవీశాఖ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని వెల్లడించారు.


Similar News