మీరు సీజ్ చేస్తే.. మేము ఓపెన్ చేసుకోలేమా.. మాస్టర్ మైండ్ స్కూల్ వ్యవహారం

విద్యాశాఖ ఆదేశాలను ప్రైవేట్ స్కూల్స్ బేఖాతరు చేస్తున్నాయి.

Update: 2024-06-12 14:24 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: విద్యాశాఖ ఆదేశాలను ప్రైవేట్ స్కూల్స్ బేఖాతరు చేస్తున్నాయి. గుర్తింపులేని లేని ప్రైవేట్ స్కూళ్లను విద్యాశాఖ సీజ్ చేస్తుండగా.. ఆ శాఖ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా స్కూళ్లను ఓపెన్ చేసి యదావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగుతుండడం శోచనీయం. వివరాల్లోకి వెళ్లితే.. ఉప్పల్ లో అనుమతులు లేకుండా మాస్టర్ మైండ్స్ ప్రైవేట్ పాఠశాల అడ్మిషన్లు తీసుకుంటుంది. విషయం తెలుసుకున్న అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) మంగళవారం స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. స్పందించిన విద్యాశాఖ అధికారులు స్కూల్ అనుమతులను పరిశీలించి,గుర్తింపు లేదని నిర్దారించి సీజ్ చేసింది. అయితే బుధవారం మాస్టర్ మైండ్స్ స్కూల్ యాజమాన్యం విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్కూల్ ను రోజు మాదిరిగానే తెరిచి కార్యకలాపాలను కొనసాగించిందని (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు సీజ్ చేసిన పాఠశాలలో మరల అడ్మిషన్లు నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్స్ పాఠశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మంగళవారం ఉప్పల్ హనుమసాయి నగర్ లో అనధికారికంగా ఏర్పాటు చేసిన ది మాస్టర్ మైండ్స్ పాఠశాలను ఉప్పల్ మండల విద్యాశాఖ అధికారులు క్లస్టర్ రిసోర్స్ పర్సన్(సీఆర్ పీ) స్వప్న సీజ్ చేసిందని తెలిపారు. కానీ సీజ్ చేసిన ప్రిన్సిపాల్ గదిని అక్రమంగా సదరు పాఠశాల యాజమాన్యం సీజ్ ను తొలగించి, అక్రమంగా అడ్మిషన్లు నిర్వహించడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. తక్షణమే విద్యాశాకాధికారులు మాస్టర్ మైండ్స్ పాఠశాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ... ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలకు పాతర వేస్తున్నారని, చట్టాన్ని,నిబంధనలను తమ చేతుల్లోకి తీసుకుని వికృత వ్యాపార పోకడలను అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ నిబంధనలనే పాటించని సదరు మాస్టర్ మైండ్స్ యాజమాన్యం, విద్యార్థుల భవిష్యత్ ను ఏ రకంగా తీర్చిదిద్దుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారుల మొద్దు నిద్ర కారణంగానే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని వారు ధ్వజమెత్తారు. కాసుల కక్కుర్తితో విద్యార్థుల భవిష్యత్తు ను అంధకారంలోకి నెట్టి వేయకుండా తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు మాస్టర్ మైండ్స్ పాఠశాల పై కేసు నమోదు చేయాలని లేని పక్షంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.


Similar News