Sajjanar : విద్యార్థుల ఫుట్‌బోర్డు వీడియో వైరల్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

టీజీఎస్ఆర్టీసీకి చెందిన ఒక బ‌స్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేస్తోన్న దృశ్యాలు సోష‌ల్ మీడియా ద్వారా యాజ‌మాన్యం దృష్టికి వ‌చ్చాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Update: 2024-10-22 15:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీజీఎస్ఆర్టీసీకి చెందిన ఒక బ‌స్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేస్తోన్న దృశ్యాలు సోష‌ల్ మీడియా ద్వారా యాజ‌మాన్యం దృష్టికి వ‌చ్చాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో విద్యార్థుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటోందని తెలిపారు. ర‌ద్దీకి అనుగుణంగా బ‌స్సుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారని పేర్కొన్నారు. అయినా కొన్ని రూట్ల‌లో విద్యార్థుల ర‌ద్దీ వీప‌రీతంగా ఉంటున్న విష‌యం సంస్థ దృష్టికి వ‌చ్చిందని వివరించారు.

ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఆయా రూట్ల‌లో బ‌స్సుల‌ సంఖ్య‌ను పెంచాల‌ని యాజ‌మాన్యం ఇప్ప‌టికే నిర్ణ‌యించిందని గుర్తుచేశారు. ఆ దిశ‌గా చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌డం జ‌రుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల‌ను క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం క‌ట్టుబ‌డి ఉందన్నారు. ప్ర‌తి రోజు ల‌క్ష‌లాది మంది విద్యార్థులు ఆర్టీసీ బ‌స్సుల్లోనే త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నారని, విద్యార్థుల‌కు ర‌వాణా ప‌రంగా ఇబ్బందుల్లేకుండా త‌గిన‌న్ని బ‌స్సుల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోందన్నారు. కావున, త‌మ‌ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేయ‌కుండా స‌హ‌క‌రించాల‌ని విద్యార్థుల‌ను యాజ‌మాన్యం కోరుతోందని పేర్కొన్నారు.

కాగా, ఫుట్‌బోర్డు ప్రయాణాన్ని నివారించేందుకు బస్సుల సంఖ్యను పెంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని సజ్జానార్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా విద్యార్థుల ఫుట్‌బోర్డు ప్రయాణం వీడియోలు పంచుకున్నారు. అదేవిధంగా షాద్‌నగర్ - ఆమన్‌గల్, మహబూబ్ నగర్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థులు తాజాగా లేఖ రాశారు. ఫుట్‌బోర్డు ప్రయాణం వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.


Similar News