వరల్డ్ కప్ మ్యాచ్‌లకు 1200 మంది పోలీసులతో బందోబస్తు

Update: 2023-10-05 11:19 GMT

దిశ, ఉప్పల్: ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 ఉప్పల్‌లో శుక్రవారం రోజు జరగనున్న పాకిస్తాన్ vs నెదర్లాండ్ మ్యాచ్‌కి 1200 మందితో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు రాచకొండ కమిషనర్ చౌహన్ అన్నారు. విలేకరుల సమావేశంలో సీపీ చౌహన్ మాట్లాడుతూ.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 6, 9, 10 తేదీలలో మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. స్టేడియంలో సుమారు 40,000 మంది సిటింగ్ సామర్థ్యం ఉందని, మ్యాచ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రికెట్ మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు.

గేట్ నెం.1 ఆటగాళ్లకు మాత్రమే, ఇతరులకు అనుమతి లేదని, ప్రేక్షకులు వారి టికెటింగ్ ప్రకారం గేట్ల ద్వారా వెళ్లాలని సూచించారు. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం కేటాయించామని పార్కింగ్ ప్రాంతాన్ని కవర్ చేయడానికి మొత్తం 360 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పర్యవేక్షించడానికి G-6 బాక్స్ వద్ద జాయింట్ కమాండ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఉప్పల్ స్టేడియం లోపటికి ఉదయం 11 గంటలకు ప్రేక్షకులను అనుమతిస్తామని మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. మ్యాచ్‌కి ప్రేక్షకులు ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్లు, ఆల్కహాల్, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్స్, బ్యాటరీలు, హెల్మెట్లు సంచులు అనుమతించబడవని తెలిపారు.

వాహనాల పార్కింగ్..

జెన్‌ప్యాక్ట్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు, ఉప్పల్ రింగ్ రోడ్ నుండి రామంతపూర్ విశాల్ మార్ట్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలను పార్క్ చేయడానికి ప్రేక్షకులకు అనుమతి లేదన్నారు. వాహనాలు టీఎస్ఐఐసి (TSIIC) పార్కింగ్ ప్రాంతాలలో పేర్కొన్న ప్రదేశాలలో మాత్రమే పార్క్ చేయాలని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్ అన్నారు.


Similar News