అందోలులో ఈ సారి గెలిచేదేవరు...!

అందోలు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉంది.

Update: 2023-12-02 09:10 GMT

దిశ, అందోల్‌: అందోలు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే..ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్‌‌నే ఇక్కడి నాయకులు కూడా నమ్ముతారు. ఇక్కడి నుంచి గెలుపొందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులయ్యారు. 1952 నుంచి అందోలు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2018 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి రాజనర్సింహ కుటుంబం అత్యధికంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన క్రాంతి కిరణ్‌ ఉండగా, కాంగ్రెస్‌ తరపున మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ, బీజేపీ తరపున మాజీ మంత్రి పి. బాబూమోహన్‌లు బరిలో నిలువనున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్యనే గట్టిపోటీ ఉండగా, బీజేపీ అంతంత మాత్రంగానే పోటీలో ఉంటుందని తెలుస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలలో కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా రావడంతో, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. రేపు వెలువడే ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమకు అనుకూలంగా ఉంటాయని ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

సంక్షేమం...అభివృద్ది పనులతో గెలుస్తామన్న ధీమాలో బీఆర్‌ఎస్‌....

బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన అభివృద్ది, సంక్షేమాలే మమ్మల్ని గెలిపిస్తాయన్న ధీమాలో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో అత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా, వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ సరఫరా, వంటి సంక్షేమ పథకాలతో లబ్దిపోందుతున్న వారంతా బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు ఉన్నట్లు వారు చెబుతున్నారు. ప్రతి మండలంలో మేజార్టీ సాధిస్తామన్న నమ్మకంతో వారున్నారు. గతం కంటే ఈ సారి మేజార్టీ తగ్గే అవకాశం ఉంటుందని, కానీ గెలుపు పక్కాగా తామేనంటూ లెక్కలు వేసుకుంటున్నారు.

గెలుపు ధీమాలో కాంగ్రెస్‌...

ఈ సారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముమ్మరంగా పర్యటించింది. దామోదర్‌ రాజనర్సింహా గెలుపు కోసం ఆయన కూతురు త్రిష గ్రామగ్రామాన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. గతంలో రెండు పర్యాయాలు దామోదర్‌పై ఓటమి చెందడంతో ఆయనపై ఉన్న సానుభూతి, బీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యే, ఆయన సోదరులపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారాయనే చెప్పవచ్చు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆసమ్మతి నాయకులు సైలేంట్‌గా ఉండటం, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరడం కూడా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమనే చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాలు సైతం అర్హులకు కాకుండా ఆదే పార్టీకి చెందిన వారికి రావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్వాన్నంగా రోడ్లు ఉండటం కూడా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత స్పష్టంగా ఉంది. పై అంశాలన్ని కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మార్చుకొవడంలో కాంగ్రెస్‌ శ్రేణులు ముందున్నాయనే చెప్పవచ్చు. వీటికి తోడు పలు ప్రైవేటు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నాయకులు గెలుపు ధీమాలో బలంగా ఉన్నారు.

ఇక్కడ గెలిస్తే... రాష్ట్రంలో అధికారంలోకి...

అందోలు అసెంబ్లీ స్థానాన్ని ఏ పార్టీ గెలుస్తుందో, ఆ పార్టీనే అధికారంలోకి ఇప్పటివరకు వచ్చింది. ఈ సారి కూడా ఇదే సెంటిమెంట్‌ కొనసాగుతుందని పలువురు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తుండడంతో అందోలులో కూడా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దామోదర్‌ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అందోలు అసెంబ్లీ స్థానానికి 2018 నాటికి 16 సార్లు ఎన్నికలు జరుగగా, ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఈ సారి జరిగే ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉందన్న నమ్మకంతో ఉండటంతో రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

ఎవరికి వారు లెక్కలు...

అందోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలోని 313 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓటరు జాబితాను తెప్పించుకుని, ఏ కేంద్రంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయాని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపు ప్రధానంగా ఆశిస్తున్న దామోదర్, చంటి క్రాంతి కిరణ్‌లు తానే గెలుస్తున్నాంటూ ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. మేజార్టీపై కూడా అంచనాలు వేసుకుంటున్నారు.

ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్వం...

అందోలు అసెంబ్లీ పోటీ చేస్తున్న అభ్యర్థుల భవిత్వం బాలేట్‌ బాక్సుల్లో భద్రంగా ఉన్నాయి. రేపు గీతం యూనివర్సీటిలో జరగనున్న ఓట్ల లెక్కింపుతో వారి భవితవ్వం బయటపడనుంది. పథకాల పనితీరుతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ ధీమా, ప్రజా వ్యతిరేకత, సానుభూతితో దామోదర్‌ గెలుస్తారని, కేంద్ర పథకాలే గెలిపిస్తాయని బాబూమోహన్‌లు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. నేటీ ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవిష్యత్‌ బయటపడనుంది.

Tags:    

Similar News