టిప్పర్ అతి వేగానికి రెండు ప్రాణాలు బలి..

టిప్పర్ అతివేగంతో రెండు ప్రాణాలు బలి అయ్యాయి. ముందు వెళ్తున్న స్కూటీని వెనుక నుంచి అతివేగంగా టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ లో చోటుచేసుకుంది.

Update: 2024-12-22 14:25 GMT

దిశ, పటాన్ చెరు : టిప్పర్ అతివేగంతో రెండు ప్రాణాలు బలి అయ్యాయి. ముందు వెళ్తున్న స్కూటీని వెనుక నుంచి అతివేగంగా టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ లో చోటుచేసుకుంది. పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా పెడన కు చెందిన అశోక్ కుమార్ సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ తన భార్యతో కలిసి అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో నివాసముంటున్నారు.

ఆదివారం ఉదయం తన భార్య నాగ శ్యామల (26) తో పాటు తన బంధువు అశోక్ (17) తో కలిసి తన స్కూటీపై కిష్టారెడ్డిపేట నుంచి సంగారెడ్డికి బయలుదేరారు. అయితే వారు ముత్తంగి చర్చి దాటి ఇస్నాపూర్ లో యూటర్న్ వద్దకు రాగానే వెనక నుంచి టిప్పర్ (ఎన్ఎల్ 01ఏఈ8171) అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ కింద పడి నాగ శ్యామల తో పాటు అశోక్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్కూటీ పైనుంచి వారు కుడివైపు పడడంతో టిప్పర్ వారిపై నుంచి దూసుకుపోవడంతో శవాలు నుజ్జు నుజ్జయ్యాయి. అశోక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధితుడు అశోక్ అతివేగంగా అజాగ్రత్తతో టిప్పర్ ను నడిపి ఇద్దరి ప్రాణాలను బలి కొన్నారని పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు విచారణ చేపట్టారు.


Similar News