రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేస్తుంది : కే ఏ పాల్

తెలంగాణలో త్వరలో జరగబోయే సర్పంచ్ , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయబోతుందని కేఏ పాల్ అన్నారు.

Update: 2024-12-22 13:07 GMT

దిశ, సదాశివపేట: తెలంగాణలో త్వరలో జరగబోయే సర్పంచ్ , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయబోతుందని కేఏ పాల్ అన్నారు. ఆదివారం సదాశివపేట మండల పరిధిలోని గమ్ సిటీ చారిటబుల్ ట్రస్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రపంచ శాంతి దూత కె ఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ ..తెలంగాణలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోబోతున్నామని అన్నారు. గత పాలకులు సర్పంచులను అప్పుల పాలు చేసి, వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని అన్నారు.

తెలంగాణను అభివృద్ధి చేయడంలో బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విఫలం అయ్యాయని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి గ్రామంలో రోడ్లు, నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని, రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల అప్పుల భారం మోపారని అన్నారు. మందకృష్ణ మాదిగ ఎస్సీలను మోసం చేశారని, ఆర్ కిష్టయ్య బీసీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను తాకట్టు పెట్టి పదవిలో అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు. సంగారెడ్డి మెదక్ జిల్లాల సర్పంచ్లకు ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


Similar News