అందోలు గురుకులంలో రెండవ రోజు ధర్నా
అందోలు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలంటూ పాఠశాల విద్యార్థులు రెండవ రోజు (ఆదివారం)కూడా ఆందోళనకు దిగారు.
దిశ, అందోల్: అందోలు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలంటూ పాఠశాల విద్యార్థులు రెండవ రోజు (ఆదివారం)కూడా ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం పాఠశాలకు చెందిన విద్యార్థినీలు ఈ ప్రిన్సిపాల్ మాకోద్దంటూ రోడ్డెక్కి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్‌డీవో పాండు, సీఐ అనిల్ కుమార్‌లు పాఠశాల విద్యార్థినీలు, స్టాప్, ప్రిన్సిపాల్‌లను వేర్వేరుగా విచారించి తప్పకుండా ప్రిన్సిపాల్‌పై చర్యలుంటాయని హమీనిచ్చారు. అయినా ప్రిన్సిపాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు అదివారం ఉదయం మరోసారి రోడ్డెక్కెందుకు విద్యార్థినీలు గేట్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐ పాండులు అడ్డుకున్నారు. వారందరిని పాఠశాల భవనం వద్దకు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చెప్పుడు మాటలు విని అనవసరంగా ఇబ్బందులు పడకూడదని సలహా ఇచ్చారు. పరీక్షలు దగ్గరపడుతున్నాయని, బాగా చదువుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మీడియాను సైతం అనుమతించలేదు.
పార్ట్‌టైం లెక్చరర్లు ప్రిన్సిపాల్‌ల మధ్య వివాదం
గత కొంత కాలంగా అందోలు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌ల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. నెల రోజుల క్రితం విధులను బహిష్కరించి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు ఫిర్యాదుకు సిద్దం అయ్యారు. రెగ్యులర్ టీచర్ల మధ్య వర్తిత్వంతో అప్పట్లో సద్దుమణిగింది. విద్యార్ధినిలందరి ముందు తనను అనుమానించిందని ఈనెల 19వ తేదీన పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ మౌనిక ప్రిన్సిపాల్‌కు సెల్‌ఫోన్‌కు రిజైన్ లెటర్‌ను పంపి విధుల నుంచి తప్పుకున్నారు. మరుసటి రోజునే మరొక పార్ట్‌టైం లెక్చరర్‌ను కూడా విధులకు హజరుకావద్దంటూ గ్రూపులో మెస్సేజ్ పెట్టడంతో వివాదాలు తారాస్థాయికి చేరాయి.
పార్ట్‌టైం లెక్చరర్‌పై కేసు
పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిలను రెచ్చగొట్టి రెండు రోజుల పాటు ధర్నా చేపట్టడానికి ఉసిగొల్పినందుకుగాను పార్ట్‌టైం లెక్చరర్ సతీష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సద్గుణమేరీ గ్రేస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామని, విద్యార్థులు ఆందోళనకు దిగడానికి ఆయనే కారణమని మా విచారణలో కూడా తేలిందని అన్నారు.