మోడీ వచ్చాకే... దేశంలో ప్రశాంతత : ఈటల రాజేందర్
ప్రధాని మోడీ పాలనలో దేశంలో ప్రశాంతత వచ్చిందని, ఎక్కడ బుల్లెట్ చప్పుళ్లు.. మత కల్లోలాలు జరగలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు
దిశ, మెదక్ ప్రతినిధి : ప్రధాని మోడీ పాలనలో దేశంలో ప్రశాంతత వచ్చిందని, ఎక్కడ బుల్లెట్ చప్పుళ్లు.. మత కల్లోలాలు జరగలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర మంగళవారం మెదక్ లోని రాందాస్ చౌరస్తా వద్ద నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఈటెల మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో టెర్రరిస్టు దాడులతో బుల్లెట్ చప్పుళ్లు, మత కల్లోలాలు పెరిగిపోయాయని లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు. కానీ గడిచిన పదేళ్లలో గోకుల్ చాట్ దాడి, టెర్రరిస్టుల దాడులు ఎక్కడ జరగలేదని, దేశం ప్రశాంతంగా ఉందని అన్నారు. మోడీ తీసుకు వచ్చిన సంస్కరణ వల్ల ప్రపంచంలో భారత్ అగ్రగామిగా మారిందని చెప్పారు.
కరోనా కాలంలో ప్రజల కోసం ఉచితంగా ఐదు కిలోల బియ్యం ఇప్పించడం తో అయుష్మాన్ భారత్ పథకం కింద పది లక్షల వైద్యం అందించే పథకం మోడీ తీసుకుని వచ్చారని అన్నారు. గత పాలకుల అహంకారం వల్ల రాష్ట్రంలో అయుష్మాన్ భారత్ పథకం అమలు చేయలేదని, ఆరోగ్య శ్రీ తెచ్చారని అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా ప్రధాన రహదారుల ఆధునీకరణ, రైల్ వే స్టేషన్ ల సుందరీకరణ మోడీని మరో సారి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని, బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రమే ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ ను ఇండియా కూటమి నమ్మడం లేదని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మోరిలో వేసినట్టే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలన్నీ అమలు చేయకపోతే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డి కి పడుతుందని హెచ్చరించారు.
మహిళలకు ఫ్రీ గా బస్సు ప్రయాణం జరగాల్సిందే, కానీ ఆటో డ్రైవర్ లకు ఇస్తామన్న రూ. 12 వేల సాయం ఇవ్వాలని కోరారు. గ్యాస్ సిలిండర్ లో గోల్ మల్ చేస్తే ప్రజలు ఊరు కోరని, గ్యాస్ కు పూర్తి డబ్బులు ప్రజలు ఇచ్చిన తరవాత ఖాతాలో వేస్తామని చెప్పడం సరికాదని అన్నారు. తెలంగాణ లో ఇచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలి డిమాండ్ చేశారు. పేదలకు వైద్యం అందించాలని మోడీ సర్కార్ ఆయుష్మాన్ భారత్ కింద రూ. 10 లక్షలు ఇస్తున్నారు వినియోగించుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు బెల్ట్ షాపులు మూసేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ బెల్టు షాప్ లు ప్రతి గ్రామాల్లో అర్ధ రాత్రి వరకు కొనసాగుతున్నాయని, ఒక్క ఆర్డర్ ఇస్తే బెల్ట్ షాప్ క్లోజ్ చేసే అవకాశం ఉన్న ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఆరోగ్యం బాగలేకపోతే ట్యాబ్ లెట్ దొరుకడం లేదని, కానీ మద్యం ఎప్పుడైనా దొరుకుతుందనీ అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు తాగుడుతో వచ్చే ఆదాయం రూ. 10,700 కోట్లు, కానీ ప్రస్తుతం రూ. 45 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ప్రజల నుంచి వచ్చిన డబ్బులతో పథకాలు ఇచ్చి వాటిని మద్యం ద్వారా ప్రభుత్వం తీసుకుంటుందని ఆరోపించారు. మహిళల కోసం వెంటనే బెల్ట్ షాపులు మూసేయాలి డిమాండ్ చేశారు. దేశంలో నంబర్ వన్ అన్న సీఎం కేసీఆర్ లక్ష రుణమాఫీ చేయకుండా బోల్తా పడ్డాడని, కానీ రెండు లక్షల రుణ మాఫీ 34 వేల కోట్లుఎలా చేస్తారో చెప్పాలన్నారు.రుణమాఫీ పై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం గా ఉందని, రేవంత్ సిద్ధమా అని సవాల్ చేశారు. ప్రతి చోట డిక్లరేషన్ ఇచ్చారని, కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రజల అవసరాల కోసం 12 కోట్ల ఇండ్లల్లో టాయిలెట్స్ మోడీ నిర్మించారని, 4 కోట్ల ప్రజలకు సొంత ఇండ్లు కట్టించాడని అన్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ రాష్ట్రంలో ఖతం అయిందని, రాబోయే రోజుల్లో బీజేపీ కి ఓటేసి మరోసారి ఆశీర్వదించాలి కోరారు.
మరో మారు మోడీని ప్రధాని చేద్దాం…బీజేపీ అధికార ప్రతినిధి రాణి
ప్రధాని గా మరోసారి మోడీని చేసేందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలని రాణి రుద్రమ కోరారు. మెదక్ లో ప్రజా సంకల్ప యాత్రలో ఆమె మాట్లాడుతూ…మరోసారి మోడీ ని ప్రధాని ని చేయడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ ని తెలంగాణ రాష్ట్రంలో ఇంట్లో ప్రజలు కూర్చోబెట్టారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ లో ఎక్కడ పోటీలో లేదన్నారు. ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు.
యూపిఏ భాగస్వామ్య పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు పోతున్నాయని, కాంగ్రెస్ తో జతకట్టేందుకు ఏ పార్టీ లేదన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలి ..మోడీ ని ప్రధానిని చేయాలని ప్రజలు చూస్తున్నారని అన్నారు. గుంపు మేస్త్రి బీజేపీ ని విమర్శిస్తున్నారని, బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు 314 పేజీల పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి కి కొరియర్ చేస్తామని చెప్పారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో అందులో ఉందని, ఓపిక ఉంటే రేవంత్ చదువుకోవాలి హితవు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీజేపీ ఏం చేసిందో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆ పార్టీ అబద్ధాల గ్యారంటీ లు ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ కి ఓటేస్తే మోడీ గ్యారెంటీలు అమలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బస్వా లక్ష్మి నర్సయ్య, పంజా విజయ్, రామ్మోహన్ గౌడ్, సంతోష్, కరణం పరిణిత, ఎం ఎల్ ఎన్ రెడ్డీ, ఎక్కల దేవి మధు, బైడ్ల సత్య నారాయణ, నందా రెడ్డీ, నాయిని ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు .