పడకేసిన పారిశుద్ధ్యం..పట్టించుకోని అధికారులు
మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండలంలోని గుజిరి తండా గ్రామపంచాయతీలో
దిశ,చిలిపి చెడ్ : మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండలంలోని గుజిరి తండా గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది. పంచాయతీ కార్యదర్శి నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లోని తడి, పొడి, చెత్తను వేరు వేరుగా సేకరించి డంపింగ్ యార్డులో వేయాల్సి ఉండగా పంచాయతీ నిర్వహణాధికారి ఇష్టానుసారంగా గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కకి పారవేయడంతో దుర్వాసన వెదజల్లుతుందని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలో ఉన్న కళ్ళు దుకాణదారులు కళ్ళు సీసాలను సైతం అక్కడే పారబోయడం తో గ్రామ ప్రజలకు పాదాచారణకు వాటి వల్ల హాని తలపెట్టే ప్రమాదం ఉందని వారన్నారు.
గ్రామంలో మురికి కాలువలను సైతం శుభ్రం చేయడం లేదన్నారు. దీంతో ఈగలు దోమలు వాలి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల రూపాయలను ఖర్చు చేసి డంపింగ్ యార్డ్ లను నిర్మిస్తే వాటి ఉపయోగం లేక అలంకారప్రాయంగానే మారాయి. దీనికి పూర్తిగా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిచడమే ప్రధాన కారణమంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యలు పునరావృతం కాకుండా వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని,నిర్లక్ష్యం వహిస్తున్న కార్యదర్శి పై చర్యలు చేపట్టాలని గ్రామాల ప్రజలు అధికారులను కోరారు.