అనుమానస్పద స్థితిలో గృహిణి మృతి

అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2024-11-24 15:14 GMT

దిశ,దౌల్తాబాద్: అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి కిషన్ వృత్తిరీత్యా ఆర్ ఎం పి వైద్యుడు. మొదటి భార్య పద్మ అనారోగ్యం కారణంగా కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందింది. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు,ఓ కూతురు ఉన్నారు. మొదటి భార్య మృతి చెందడంతో రెండు సంవత్సరాల క్రితం నిర్మల్ పట్టణానికి చెందిన ప్రవీణను వివాహం చేసుకున్నాడు.పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుండే డబ్బుల విషయంలో తరుచూ భార్యాభర్తలకు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గొడవలు రోజురోజుకు పెరిగాయి.

మొదటి భార్య పెద్ద కుమారుడైన శ్రీనివాస్ అతని భార్య మూలంగానే గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానిక హనుమాన్ దేవాలయం పున ప్రతిష్ట కోసం హనుమాన్ దీక్ష ధరించాడు ఇమ్మడి కిషన్. దీక్షలోనే ఆదివారం ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడి కొట్టి తిరిగి ఆలయం వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో కొడుకు శ్రీనివాస్ భార్యతో సహా ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి భర్త ఇమ్మడి కిషన్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా చేతులపై దెబ్బలు కనిపించాయి. మృతురాలి చేతులకు గాయాలు ఉన్నందున మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు వచ్చే వరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచాలని స్థానికులు అడ్డుకున్నారు.పోలీసులు మృతురాలి ఇంట్లోనే శవాన్ని ఉంచారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Similar News