అక్రమాలకు అడ్డాగా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
తప్పుడు పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు తూప్రాన్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేరాఫ్ అడ్రస్ గా మారింది.

దిశ, తూప్రాన్ : తప్పుడు పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు తూప్రాన్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ కార్యాలయంలో అవినీతి రోజురోజుకు మితిమీరిపోతోంది. మండలంలోని రావెల్లి శివారులో ఒకే భూమిని మూడుసార్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి ఇక్కడి అధికారులు తమ ఘనతను చాటుకున్నారు. ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ల వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవ పెట్టారు. ఈ ఘనకార్యం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తూప్రాన్ హైవే బైపాస్ లో సర్వే నంబర్ 97/రు లోని 4 గుంటల భూమిని 12 గుంటలు గా విస్తీర్ణం పెంచి జనవరి 16న 158,159 నంబర్లపై రెండు డాక్యుమెంట్లు, ఫిబ్రవరి12వ తేదీన 560 డాక్యుమెంట్ నంబరుపై మరొకటి మొత్తం మూడు ఫేక్ డాకుమెంట్లును సృష్టించారు.
ఈ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధిత రైతు బూర్గుల గోవర్ధన్ రెడ్డి మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాడు. సబ్ రిజిస్ట్రార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఫేక్ డాక్యుమెంట్లను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. బాధిత రైతు బూర్గుల గోవర్ధన్ రెడ్డి, ఈ విషయం గురించి వివరణ అడగడానికి మీడియా వాళ్లు ఆఫీసుకు వెళ్లగా ఎస్ఆర్వో అందుబాటులో లేరు. ఇన్చార్జి అధికారి తనకు తెలియదని సమాధానమిచ్చారు. గత ఏడాదిలోనే అక్రమ రిజిస్ట్రేషన్ ల కేసులో ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ జైలుకు వెళ్లిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూడటం గమనార్హం.
సబ్ రిజిస్ట్రార్ లో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నప్పటికి జిల్లా సబ్ రిజిస్ట్రార్ పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారుతోంది. అక్రమార్కులకు ఇక్కడ అధికారులు అండదండలు అందిస్తుండగా అమాయక ప్రజలు అన్యాయానికి, మోసాలకు గురవుతున్నారు. ఇంతకు ముందు అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జైలుకు వెళ్లిన సబ్ రిజిస్ట్రార్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ కూడా సరిగా నెల రోజుల విధులు నిర్వహించలేకపోవడం గమనార్హం. అనేక రకాల అక్రమాలు జరిగాయని తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేయడానికి అధికారులు భయపడుతున్నారని తెలుస్తోంది. దీంతో ప్రజలు రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ ను వివరణ కోరగా సెలవులో ఉన్నా.. వచ్చాక వివరణ ఇస్తాం అని తెలిపారు.