తప్పుడు పత్రాలతో డంపింగ్ యార్డ్‌కు అనుమతులు..

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం, నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని

Update: 2025-03-18 13:53 GMT
తప్పుడు పత్రాలతో డంపింగ్ యార్డ్‌కు అనుమతులు..
  • whatsapp icon

దిశ, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం, నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్‌లో 152 ఎకరాల భూమిలో ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ( డంపింగ్ యార్డు ) కు అనుమతులు అక్రమంగా మంజూరయ్యాయని ఆరోపిస్తూ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో గుమ్మడిదల-నర్సాపూర్ జేఏసీ నాయకులు మంగళవారం న్యూఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ సుశీల్ కుమార్ అవస్తి ను వారి ప్రధాన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్యారానగర్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం కేటాయించిన భూమి అటవీ శాఖ భూమి అని అన్నారు.

అయినప్పటికీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అనుమతులు పొందారని ఆరోపించారు. భూమి అప్పగించే ముందు అధికారిక సర్వే చేయకపోవడం, గ్రామ సభ నిర్వహించకపోవడం, రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయిలో సబ్-డివిజనల్ కమిటీ ఏర్పాటు చేయకపోవడం వంటి అనేక లోపాలను లేఖలో వివరించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనుల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ, అసలు సంబంధం లేని మూగురు సర్పంచ్లను ఎంపిక చేసి తప్పుడు పత్రాలు సమర్పించారని ఆరోపించారు. వీరిలో ఒకరు ప్రాజెక్టు ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి చెందినవారని, మరొకరు గిరిజనుడే కాకపోయినా అతని పేరును వినియోగించారని తెలిపారు.

అంతేకాదు, ఓ మహిళా సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతులు తెచ్చుకున్నారని, ఆమె ఈ విషయంపై అఫిడవిట్ కూడా ఇచ్చిందని వివరించారు. "స్థానిక అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు చట్టబద్ధత పాటించకుండా అనుమతులు మంజూరు చేశారని అన్నారు. దీంతో గ్రామ పర్యావరణానికి ముప్పు ఏర్పడబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని ఎంపీ రఘునందన్ రావు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మురళి యాదవ్, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మద్దుల బల్ రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, అమ్మగారి సదానందా రెడ్డి, జోగినాథ్ గుప్తా, చెన్నంశెట్టి ఉదయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Similar News