దేశంలోనే నిజమైన రైతు నాయకుడు సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు..
దేశంలోనే నిజమైన రైతు నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : దేశంలోనే నిజమైన రైతు నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయపల్లి గ్రామంలో దుద్దేడ- బంధారం, కొనాయపల్లి- ముండ్రాయి గ్రామాలను కలుపుకుని వెళ్లే డబుల్ లేన్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, మండల కేంద్రంలో నూతన తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయ భవనాలను, ఇరిగేషన్ గెస్ట్ హౌజ్, నాలుగు వరసల రహదారి నిర్మాణ పనులకు, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీటీసీ తడిసిన ఉమావెంకట్ రెడ్డి, ఏంపీపీ అరుణదేవి, ఆర్డీఓ అనంతరెడ్డి, ఏంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు, కరెంటు, సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.
కాంగ్రెస్ హయాంలో గ్రామాలు గతుకుల మయంగా ఉంటే, సీఎం కేసీఆర్ హయాంలో అన్నింటా బతుకుల మయంగా మారిందన్నారు. నాడు ప్రజలు బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తే నేడు పక్కా రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించే స్థితికి పల్లెలు అభివృద్ధి చెందాయన్నారు. ఆయిల్ ఫామ్ కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.1000 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. రూ.307 కోట్లతో నంగునూరు మండలంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. దీనికి తోడు రూ.2వందల కోట్లతో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మండల దశ, దిశను మారుస్తోందన్నారు. కాళేశ్వరం నీళ్లు వాగు అవతలి గ్రామాలకు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో అకాల వర్షాలు వడగండ్ల వానతో 80వేల ఎకరాలలో పంటలకు నష్టం జరిగిందన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10వేలు ప్రభుత్వం అందిస్తోందన్నారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ ఆలయమైన కొనాయపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం, నర్మెట శ్రీసీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి ఆలయ బ్రహోత్సవాలు పురస్కరించుకుని నిర్వహిస్తున్న సుదర్శన హోమం కార్యక్రమాలలో మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు జాప శ్రీకాంత్ రెడ్డి, కోల రమేష్ గౌడ్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నారాయణరావు పేట మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద రూ.3.30 కోట్లతో చేపట్టిన హై లెవల్ బ్రిడ్జీ పునర్నిర్మాణం పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.