వైద్యం సరే... పోషకాహారం మాటేది..? కొరవడిన అధికారుల పర్యవేక్షణ.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆసుపత్రిలో అవసరమైన వైద్యం

Update: 2024-07-08 13:44 GMT

దిశ,దుబ్బాక : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆసుపత్రిలో అవసరమైన వైద్యం అందించడంతోపాటు అడ్మిట్ అయిన పేషెంట్ కు పేషెంట్ తో పాటు ఉన్న వ్వక్తి కి మూడు పూటలా పోషకాహారం అందించాల్సిన బధ్యత ఆసుపత్రి నిర్వాహకులపై ఉంటుంది. అయితే దుబ్బాక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఇన్ పేషెంట్లకు ప్రతి రోజు అందాల్సిన పోషకాహారం సరిగా అందడం లేదు. వివిధ పనుల నిర్వహణకు పలు సంస్థలకు అధికారులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందించడం సర్వసాధారణం. ఇందులో భాగంగా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి లో సైతం ఇన్ పేషెంట్ల కోసం, వారితో పాటు వచ్చే వారి బంధువులకు ఆహారం అందించేందుకు బయటి వారితో కాంట్రాక్ట్ పద్ధతిన అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు ప్రతి రోజు మూడు పూటలా అందాల్సిన పోషకాహారమైన ఉడికించిన గుడ్డు కేవలం ఒక్క పూటకు మాత్రమే అందడంతో వారు వాపోతున్నారు.సాధారణంగా ప్రభుత్వాసుపత్రిలో ఒప్పందం ప్రకారం రోగులకు ప్రతి రోజు ఉదయం 7:30 నుండి 8:30 గంటల వరకు ఇడ్లీ, సాంబార్, లేదా పొంగల్, కిచిడి, ఉష్మ, బ్రెడ్ తోపాటు పాలు, ఉడికించిన గుడ్డు అందించాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో 12 గంటల నుండి 1 గంట వరకు రైస్ లేదా పుల్కా, వెజ్ కర్రీ, ఆక కూర పప్పు, సాంబార్, ఉడికించిన గుడ్డు, పెరుగు లేదా మజ్జిగతోఆపటు అరటిపండు అందించాలి. అనంతరం రాత్రి భోజనానికై సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు రైస్ లేదా పుల్కా, వెజ్ కర్రీ, సాంబార్, ఉడికించిన గుడ్డు, పెరుగు లేదా మజ్జిగతోపాటు అరటిపండు అందించాల్సి ఉంటుంది. ఈ మెనూ ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ ప్రతి రోజు మూడు పూటలా రోగులకు ఖచ్చితంగా ఉడికించిన గుడ్డును అందించాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కేవలం ఒకే పూట ఉడికించిన గుడ్డు అందించి కాంట్రాక్టర్ చేతులు దులుపుకుంటున్నాడు.

అంతేకాకుండా అధికారులు ఇచ్చిన మెనూ ప్రకారం మూడు పూటలా గుడ్డు అందిస్తున్నట్లుగా బిల్లులు తీసుకుంటున్నట్లుగా సైతం ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై ఉన్నతాధికారులు పట్టించ కోకపోవడం మూలంగా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మెనూ ప్రకారం భోజనాన్ని అందించకుండా పలుమార్లు తమకిష్టమైన ఆహారాన్ని సైతం అందిస్తు ఉన్నట్లుగా రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున సంబంధిత వైద్యాధికారులు సదరు కాంట్రాక్టర్ వ్యవహారంపై దృష్టి సారించి రోగులకు మెరుగైన పోషకాహారం అందించేందుకు కృషి చేయాలని రోగులతో పాటు వారి వెంట వచ్చే వారి బంధువులు, కుటుంబీకులు కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలన్నా, రోగులకు మూడు పూటలా ఉడికించిన గుడ్డు అందిస్తారో లేదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.


Similar News