తెలంగాణ ఆత్మాభిమానానికి ప్రతిబింబం బతుకమ్మ
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మాభిమానానికి ప్రతిబింబం అని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
దిశ, సంగారెడ్డి : బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మాభిమానానికి ప్రతిబింబం అని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లా సమైక్య ఆధ్వర్యంలో పాత డీఆర్ డీఏ కార్యాలయ ప్రాంగణంలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ వంటి పండుగలు మహిళా శక్తిని ప్రదర్శించడానికి, సామాజిక ఐక్యతను మరింతగా పెంపొందించడానికి ఉపయోగపడతాయన్నారు.
మహిళల శక్తి ద్వారా సొసైటీలో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. మహిళా సంఘాలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. మహిళా సంఘాలు తమ సొంత పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని, వీటికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ వేడుకల్లో డీఆర్ డీఓ జ్యోతి , ఏపీఓలు, జిల్లా మహిళా శక్తి సంఘ సభ్యులు, వివిధ మండలాల మహిళలు హాజరయ్యారు.