వ్యక్తిగతంగా విభేదాలు ఉన్న కేసీఆర్ ను గెలిపించాలి : వంటేరు ప్రతాప్ రెడ్డి
శ్రీరాముని పాలనలో మనము చూడలేము.. కానీ గడిచిన తొమ్మిది ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఏర్పడి యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు.
దిశ, మనోహరాబాద్: శ్రీరాముని పాలనలో మనము చూడలేము.. కానీ గడిచిన తొమ్మిది ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఏర్పడి యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రమైన మనోరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్ మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్ అధ్యక్షతనలో బూత్ లేవల్ కమిటీ సభ్యుల ఎంపిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ మూడవసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని ఆయనను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి శేషం లేకుండా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ప్రతి బూత్ లెవెల్ సభ్యుడు 90 శాతం ఓటర్లను ప్రభావితం చేసి సీఎం కేసీఆర్ కు ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలని కోరారు. త్వరలోనే సీఎం కేసీఆర్ నేతృత్వంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని, ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. అనంతరం మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. మండలం నుండి పదివేల మెజార్టీని సీఎం కేసీఆర్ కు అందించాలని, మండలంలోని మనందరి మధ్య వ్యక్తిగతంగా విభేదాలు ఉన్న అందరూ కలిసికట్టుగా సీఎం కేసీఆర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికి అందించే సంక్షేమ పథకాలు, గ్రామానికి చేపడుతున్న అభివృద్ధి పథకాలను వివరించి సీఎం కేసీఆర్ కు ఓటు వేయాలని అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇకపోతే కాంగ్రెస్ లో కుమ్ములాటలతో అభ్యర్థుల ఎంపిక జరగడంలేదని, సీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలవదని, అలాగే బీజేపీ లో అభ్యర్థి లేక, క్యాడర్ లేక సతమతం అవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మిగిలింది కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సీఎం కేసీఆర్ ఏ అని తెలిపారు.
బూత్ కమిటీ సభ్యులకు భారీ నజరానా..
మండలంలో బూత్ కమిటీ సభ్యులకు ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి తన సొంతంగా భారీగా నజరాన ప్రకటించారు. బూత్ కమిటీలో ఉన్న ఓటర్లను పూర్తిస్థాయిలో సీఎం కేసీఆర్ కు ఓట్లు వేయించిన వారికి తాను సొంతంగా నజరానా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందిస్తానని ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు. మొదటి స్థానంలో నిలిచిన బూత్ కమిటీ సభ్యులకి ఐదు లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన వారికి మూడు లక్షలు, మూడవ స్థానంలో నిలిచిన వారికి రూ. 2 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ చేతులమీదుగా నజరానా అందించి సన్మానం చేయిస్తానని ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్, స్థానిక సర్పంచ్ చిటుకుల మహిపాల్ రెడ్డి, ఉమ్మడి మండల సొసైటీ అధ్యక్షుడు మెట్టు బాలకృష్ణారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, చంద్రశేఖర్ ముదిరాజ్, పురం రవి ముదిరాజ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.