తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య..
పనికి వెళ్లకుండా స్నేహితులతో తిరుగుతున్నాడని తండ్రి
దిశ, చేగుంట : పనికి వెళ్లకుండా స్నేహితులతో తిరుగుతున్నాడని తండ్రి మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట మండల పరిధిలోని బొమ్మారం గ్రామానికి చెందిన కర్ణ ప్రశాంత్ (22) రోజువారి కూలి చేసుకుంటూ జీవనం సాగించేవాడు.. గత కొన్ని రోజులుగా పనికి పోకుండా స్నేహితులతో తిరుగుతుండడంతో అతని తండ్రి రామస్వామి మందలించాడు.
తండ్రి మందలించడంతో ఈనెల 17వ తేదీ రాత్రి సమయంలో గ్రామంలో కల్లు దుకాణం వద్ద ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి సమాచారం అందించారు. వెంటనే తండ్రి రామస్వామి కుమారుడు ప్రశాంత్ ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.