తెలంగాణ వస్తే చీకటే అన్నోళ్లు.. చీకట్లో కలిసిపోయారు : టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింత ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు చీకట్లోనే ఉంటారని చెప్పినోళ్లు.. ప్రస్తుతం చీకట్లోనే కలిసిపోయారని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.
దిశ, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు చీకట్లోనే ఉంటారని చెప్పినోళ్లు.. ప్రస్తుతం చీకట్లోనే కలిసిపోయారని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. సోమవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర విద్యుత్ విజయోత్సవ దినోత్సవం సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎస్ఈ మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే దీపాలు పెట్టుకొని చీకట్లో ఉండాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ అన్నారని.. ఇప్పుడు తాను చీకట్లోకే వెళ్లాడని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రూ.150.51 కోట్లతో విద్యుత్ సరఫరా అభివృద్ధి చేశామన్నారు. విద్యుత్ రంగానికి బలోపేతం చేయడానికి ప్రభుత్వం రూ.39.321 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి, దేశానికే దారి చూపే టార్చ్ బేరర్‌గా తెలంగాణ నిలిచిందన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా అభివృద్ధి పథంలో పయనిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని జిల్లా కలెక్టర్ డా శరత్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కోతల వల్ల ఎండిన పంటలతో రైతులు, ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపే వారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రమణకుమార్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, విద్యుత్ సూపరింటెండెంట్ మాధవరెడ్డి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.