వెలిమెల భూముల ఇష్యూలో తలదూర్చొద్దని హైకోర్టు ఆదేశం..లెక్కచేయని పోలీసులు..
వెలిమల వివాదాస్పద భూముల్లో ఇంకా వివాదం కొనసాగుతూనే
దిశ,పటాన్ చెరు : వెలిమల వివాదాస్పద భూముల్లో ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల నుంచి భారీగా మోహరించిన పోలీస్ ప్రొటెక్షన్ ను ఉపసంహరించాలనే రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదు. ఆ భూముల్లోనే పోలీస్ పహారా ఇంకా కొనసాగుతుంది. తాము ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అన్యాయంగా బడా బాబులకు కట్టబెట్టారని ఆరోపిస్తూ గత వారం రోజులుగా గిరిజనులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
రెవెన్యూ ఉన్నతాధికారుల సహకారంతో రికార్డులను సృష్టించుకుని బడా బాబులు తమకు అన్యాయం చేస్తున్నారని పేదలు గుండెలు బాదుకుంటున్నారు. పోలీస్ పహారా మధ్య గత రెండు రోజుల నుంచి భూమిని అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాము ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో దౌర్జన్యంగా ప్రవేశిస్తున్నారని తండా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇష్యూ లో రైతులని పోలీసులు కంట్రోల్ చేశారు. దీంతో రైతులు హైకోర్టులో రిట్ ఆఫ్ మైండ్ మాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ చేసిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఆ భూముల్లో పోలీసుల ఎంట్రీ తీవ్రంగా స్పందించారు. సివిల్ ఇష్యూలో పోలీసుల జోక్యంపై మండిపడుతూ, ఈ వివాదంలో పోలీసులు తలదూర్చవద్దని ఆదేశించారు.
పోలీసుల కోర్టు ధిక్కరణ..
వెలిమల తండా భూముల విషయంలో పోలీసుల జోక్యం తగదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఒక వైపు సదరు భూముల్లో వందలాది ప్రైవేట్ సైన్యాలు తిష్టవేసిన వారికి మద్దతు తెలుపుతూ అమాయకులైన రైతులను నిర్బంధించి అరెస్టులు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల్లో రెండు రోజుల కింద గిరిజన రైతులు అక్రమంగా ప్రవేశించారని కేసులు నమోదు చేసి అక్రమంగా గిరిజన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. హైకోర్టు ఆదేశాలపై స్థానిక పోలీసులను వివరణ కోరగా తమకు కోర్టు కాపీలు అందలేదని ఒకరు, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మోహరించి ఉన్నామని మరొకరు సమాధానం ఇచ్చారు. గిరిజన రైతులపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అక్కడే మోహరించిన ప్రైవేట్ సైన్యాల విషయంలో స్పందించకపోవడం గమనార్హం.