సోలార్ యాజమాన్యంపై గ్రామ పంచాయతీల ప్రేమ..
సోలార్ ప్లాంట్స్ పై గ్రామ పంచాయతీలు అతి ప్రేమ చూపించాయి..
దిశ,మెదక్ ప్రతినిధి : సోలార్ ప్లాంట్స్ పై గ్రామ పంచాయతీలు అతి ప్రేమ చూపించాయి.. వందల ఎకరాల్లో కొనసాగుతున్న సోలార్ ప్లాంట్స్ లో ఎన్ని భవనాలు నిర్మించారో ఇప్పటికీ పూర్తి లెక్కలు లేవట.. అదేంటి అని ప్రశ్నిస్తే.. అప్పట్లో ఉన్న వారికి తెలియాలి అంటున్నారు.. కానీ తర్వాత వచ్చిన అధికారులు ఎందుకు బిల్డింగ్ టాక్స్‌పై శ్రద్ధ పెట్టలేదు అంటే దానికి సమాధానం లేదు.. అధికారులు, గ్రామ పంచాయతీ అనధికార ఒప్పందంతో ప్రతి ఏటా రావాల్సిన పన్ను ఉష్ అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో సోలార్ ప్లాంట్స్ లలో నిర్మించిన భవనాల టాక్స్ వసూళ్లలో పంచాయతీ అధికారులు కొత్త విషయాలు చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంతో పాటు శేరిపల్లి, హస్సన్ మహమ్మద్ పల్లి, పాల్వంచ, దాదాయిపల్లి, కాద్లూర్, సాలోజి పల్లి, కోరంపల్లి, ఎల్లంపల్లి, మల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సోలార్ ప్లాంట్స్ నిర్మాణం జరిగింది. నిబంధనల ప్రకారం సోలార్ ప్లాంట్స్ నిర్మాణం దశలోనే గ్రామ పంచాయతీ వద్ద ఎన్ వో సి తీసుకొని భవనాలు నిర్మించాలి. తప్పని సరిగా అనుమతి ఉంటేనే నిర్మాణం జరగాలి. కానీ అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకుల అండతో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది.
సుమారు 600 నుంచి 800 ఎకరాల్లో సోలార్ ప్లాంట్స్ నిర్మాణం జరిగింది. అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలు ఉండడంతో సోలార్ నిర్మాణం లో పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. అప్పటి సర్కారు లో కీలక నేత మద్దతు ఉండడం మూలంగా నిబంధనలు గాలికి వదిలేశారు. సోలార్ ప్లాంట్స్ కు సమీపంలో ఉన్న చెరువులు కుంటలు సైతం కబ్జా చేసిన అప్పట్లో అధికారులు ప్రేక్షక పాత్ర వహించారన్న విమర్శలు వచ్చాయి. అందులో భాగంగానే భవనాల నిర్మాణంలో కూడా ఇష్టారీతిగా వ్యవహరించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దిశ పత్రికలో వచ్చిక కథనం పై అధికారులు వివరణ కోరగా ఇప్పటి వరకు సోలార్ ప్లాంట్స్ వద్ద ఎన్ని భవనాలు ఉన్నాయన్న సమాచారం లేకపోవడం గమనార్హం. కేవలం పాల్వంచ గ్రామ పంచాయతీ మాత్రం ప్రతి ఏటా 8 వేలు పన్ను వసూలు చేస్తుంది. కానీ ఆ పంచాయతీ పరిధిలో ఎన్ని భవనాలు ఉన్నాయన్న సంచారం మాత్రం గోప్యత గానే మారింది. ఎన్ని సోలార్ ప్లాంట్స్ లలో సమగ్ర విచారణ జరిపి అన్నింటికీ అనుమతులు ఇచ్చారు.. అనుమతులు లేకుండా నిర్మాణం జరిగింది ఎందుకు చర్యలు తీసుకోలేదని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
రూ.లక్షలు స్వాహా..
సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు సహకరించిన రాజకీయ నేతలకు, అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడం మూలంగా సోలార్ నిర్మాణంలో నిబంధనలు పాటించకున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా గ్రామంలో ఇంటి నిర్మాణం చేపడితే ఇటు అధికారులు, అటు రాజకీయ నేతలు అడ్డుపడి మరి నిర్మాణం నిలిపి వేస్తారు. అలాంటిది వ్యాపార కోణం లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్స్ లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్న ఎందుకు అధికారులు అడ్డుకోలేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఏళ్లుగా సోలార్ యాజమాన్యం గ్రామ పంచాయతీలకు పన్ను చెల్లించకుండా ఉన్నా ఇప్పటి వరకు టాక్సీ పై నోరు మెదపని అధికారులు ఉన్నారంటే సోలార్ యాజమాన్యం పై ప్రత్యేక ప్రేమ ఏమిటో అర్థం అవుతుంది. టేక్మాల్ మండల శివారులోని పది గ్రామాల్లో ఎన్ని భవనాలు ఉన్నాయి.. అనుమతులు ఎందుకు తీసుకోలేదు.. ప్రతి యేటా ఎంత పన్నులు చెల్లించకుండా ఎగనామం పెట్టారు అనే విషయాల పై విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఆ దిశగా అధికారుల విచారణ సాగుతుందా లేదా చూడాలి మరి..!