అగ్నివీర్ నియామక ర్యాలీకి దరఖాస్తు చేసుకోవాలి
అగ్నిపథ్ పథకంలో భాగంగా చేపట్టనున్న అగ్నివీర్ నియామకాలకు జిల్లాలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి కోరారు.

దిశ, సిద్దిపేట అర్బన్ : అగ్నిపథ్ పథకంలో భాగంగా చేపట్టనున్న అగ్నివీర్ నియామకాలకు జిల్లాలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... ఈ నియామకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఏప్రిల్ 10 వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్ మెన్ తదితర విభాగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. జనరల్ విభాగానికి 10వ తరగతి 45 శాతం మార్కులతో, టెక్నికల్ కు ఇంటర్ ఎంపీసీ 50 శాతం మార్కులతో, క్లర్కు విభాగానికి ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో, ట్రేడ్ మెన్ కు పదవ తరగతి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని చెప్పారు. ఈ నియామక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని, మొదటిది 200 మార్కులకు కామన్ ఎంట్రెన్స్ పరీక్ష, రెండవ దశలో రన్నింగ్, శారీరక దృఢత్వ పరీక్షలు ఉంటాయని చెప్పారు. రూ. 250 పరీక్ష రుసుముతో సంబంధిత అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష జూన్ నెలలో ఉంటుందన్నారు. నియామకాలు పూర్తిగా మెరిట్ పైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.